Harish Rao | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆందోళనలు జరగకుండా బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు కక్షతో పాడి కౌశిక్ రెడ్డిని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఒక న్యూస్ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సోమవారం రాత్రి తిరిగి వెళ్తుండగా.. అప్పటికే పథకం ప్రకారం ఆ చానల్ గేట్ ముందు మోహరించిన కరీంనగర్ పోలీసులు.. ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డిని చుట్టుముట్టా రు. ఒక వ్యక్తికి సెల్ఫీ ఇస్తున్న సమయంలో దాదాపు నలభై మంది పోలీసులు రౌండప్ చేసి కారణాలు చెప్పకుండానే అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అరెస్టును కౌశిక్‌రెడ్డి ప్రతిఘటించగా, బలవంతంగా కారులో ఎక్కించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పండి అంటూ నిలదీయడంతో ‘కరీంనగర్లో నమోదైన కేసు గురించి’ అంటూ అదుపులోకి తీసుకున్నారు. ‘నేను వస్తాను.. ఎందుకు నెడుతున్నారు? నెట్టకు భయ్యా’ అని పాడి కౌశిక్‌రెడ్డి చెప్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అరెస్టుకు సంబంధించిన వారెంట్, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండానే కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
కాగా, మంగళవారం ఉదయం కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కౌశిక్‌రెడ్డికి ఇవాళ రిమాండ్ విధించే అవకాశం ఉంది.