హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల దళిత డిక్లరేషన్ పేరిట 12 హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఆ తర్వాత దళితులకు తీరని ద్రోహం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. రెండున్నరేండ్లు దాటినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా దారుణంగా వంచించిందని మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేసిన డిక్లరేషన్‌కు పాతరేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రేవంత్ సర్కార్ చేసిన ద్రోహంపై త్వరలోనే ఖర్గేకు బహిరంగ లేఖ రాస్తామని ప్రకటించారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవీంద్రకుమార్, గాదరి కిశోర్, రేగా కాంతారావు, చంటి క్రాంతికిరణ్, సుంకె రవిశంకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏటా 4లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మి స్తామని, ఎస్సీ, ఎస్టీలకు రూ. 6లక్షలు, ఇతరులకు రూ. 5లక్షలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని కొప్పుల విరుచుకుపడ్డారు. రెండున్నరేండ్లలో 3.82 లక్షలు ఇండ్లు మంజూరు చేసి ఇప్పటివరకు పూర్తిచేసింది కేవలం 57వేలు మాత్రమేనని గుర్తుచేశారు. పేదలకు ఇండ్ల మంజూరుకు కాంగ్రెస్ నాయకులు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో కేసీఆర్ 1,100 గురుకులాలు ఏర్పాటుచేశారని కొనియాడారు. కానీ, రేవంత్ మాత్రం కేసీఆర్‌పై కక్షతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేసి బస్సుయాత్ర చేయాలని సవాల్ విసిరారు.
50వేల ఎకరాలు లాక్కున్నరు: మాలోతు కవిత
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరించిందేమీలేదని, పరిశ్రమల ఏర్పాటు ఇతరత్రా కారణాలతో 50 వేల ఎకరాల అసైన్డ్ భూములను గుంజుకున్నారని మాజీ ఎంపీ మాలోతు కవిత ఆరోపించారు. లగచర్లలో లంబాడీల భూములు గుంజుకొని అడ్డుకున్న బిడ్డలపై దారుణానికి ఒడిగట్టిందని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి కాదు.. హిట్లర్రెడ్డి : రసమయి
ఎస్సీ, ఎస్టీల బతుకుల్లో వెలుగులు నింపుతామని నాడు ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి, నేడు హిట్లర్రెడ్డిగా మారి చేసిందేమీలేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విరుచుకుపడ్డారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఏ ఒక్క హామీని అమలుచేయకుండా సంబురాలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.