హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు గండికొట్టి, ఆంధ్రాకు తరలించుకుపోయేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తొండివాదన వినిపించారు. శనివారం ఏపీలోని కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ.. పోలవరం-బనకచర్ల నిర్మాణం పూర్తి చేసి, వంశాధార, పెన్నా నదులను అనుసంధానం చేస్తే.. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కరువు అనేదే రాదని, అదే తన జీవిత ఆశయమని చెప్పారు. గోదావరి, కృష్ణాలో చాలా టీఎంసీల జలాలు సముద్రంలోకి వెళ్లాయని తెలిపారు. సముద్రంలోకి వెళ్లే నీటిని తెలంగాణ, ఆంధ్ర సమర్థంగా ఉపయోగించుకోగలిగితే ప్రతీ ఎకరాకు నీళ్లిచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. కరువు అనే మాటే ఉండదంటూ బుకాయించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు గురించి తాను ఆలోచిస్తే కొంతమంది మాత్రం అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణ వాళ్లు అర్థం చేసుకోవాలని చెప్పారు. తాను అభివృద్ధి కోసం తపిస్తుంటే.. కొంతమంది రాక్షసుల మాదిరిగా.. ఈ యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని తన నైజాన్ని బయటపెట్టుకున్నారు.
చేతనైతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడాలని సుద్దులు చెప్పారు. ఏపీలో చంద్రబాబు తెగించి, ఇన్నేసి మాటలు అంటుంటే.. కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన నీటి హక్కులు కాపాడుతామంటూ ముఖ్యమంత్రి, మంత్రులు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నా.. ఆచరణలో చేసిందేమీలేదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న బీఆర్ఎస్.. శనివారం బీఏసీ మీటింగ్‌లో బనకచర్ల నిర్మిస్తే తెలంగాణకు వాటిల్లే నష్టంపై చర్చించాలని కోరింది. ప్రభుత్వం ఇవేమీ తమకు పట్టనట్టు వ్యవహరించడంతో తెలంగాణ ప్రయోజనాలపై కాంగ్రెస్ నేతల చిత్తశుద్ధి ఏ పాటిదో మరోసారి స్పష్టమైందని తెలంగాణవాదులు అంటున్నారు. బనకచర్లపై చంద్రబాబు బాహాటంగా ప్రకటనలు చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కిమ్మనకపోవడం.. సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు జలదోపిడీపై స్పందించలేని కాంగ్రెస్ నేతల చేతగానితనాన్ని ప్రజలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని నెటిజన్లు మండిపడుతున్నారు.