గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం కేటీఆర్ ఈడీ విచారణకు బయలుదేరారని తెలిసిన వెంటనే పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈడీ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయం త్రం వరకు సుమారు 400 మంది పోలీసులు మోహరించారు. కేటీఆర్ ఉదయం ఈడీ ఆఫీసుకు వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు ఆయనకు మద్దతుగా చేరుకున్నారు. అక్కడ ఈ క్రమంలో ‘అక్రమ కేసులు పెట్టిన సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ కొందరు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ సంజయ్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు ఎక్కడివారిని అక్కడే రోప్‌పార్టీతో చెదరగొట్టారు. ఈక్రమంలో మీడియాతో మాట్లాడుతూ నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్, పల్లె రవికుమార్ గౌడ్, సుమిత్రానంద్, పావనిగౌడ్, కీర్తిలత గౌడ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం కేటీఆర్ విచారణ ముగించుకొని వస్తున్న సందర్భంగా మరికొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యాన్లలోకి ఎక్కించారు.