‘ఇది రాజ్‌భవన్ కాదు.. ప్రజాభవన్. 24 గంటలు రాజ్‌భవన్ తలుపులు తెరిచే ఉంటాయి. ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం’ అని గొప్పలు చెప్పుకొన్న రాష్ట్ర గవర్నర్.. సాటి మహిళల గోడు వినటానికి మాత్రం తలుపు తెరువలేదు. తమ గోడు చెప్పుకొనేందుకు రాజ్‌భవన్ తలుపు తడితే కాదు.. కుదరదు పొమ్మన్నారు. పోలీసులతో బలవంతంగా గెంటేయించారు. వైఎస్ షర్మిలకు అడగటమే ఆలస్యం అపాయింట్మెంట్ ఇచ్చిన గవర్నర్.. బీజేపీ నేతలు అర్ధరాత్రి తలుపుతట్టినా క్షణాల్లో స్పందించే గవర్నర్.. బీఆర్ఎస్ నేతలకు మాత్రం ముఖం చాటేశారు.
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాజ్‌భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివక్ష మరోసారి బయటపడింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మహిళా నేతలను పోలీసులతో గెంటేయించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఇతర మహిళా కార్పొరేటర్లు గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా.. ఆమె కనీసం స్పందించలేదు. అపాయింట్మెంట్ కోసం శనివారం ఉదయం నుంచీ ప్రయత్నించినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. వినతిపత్రం ఇచ్చేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లిన నేతలను గేటు బయటే నిలబెట్టారు.
ఎవరైనా సరే తమ సమస్యలు చెప్పుకొనేందుకు రాజ్‌భవన్‌కు రావొచ్చని, 24 గంటలూ రాజ్‌భవన్ తలుపులు తెరిచే ఉంటాయని గవర్నర్ గతంలో ప్రకటించారు. తాను ఉండేది రాజ్‌భవన్ కాదని.. ప్రజాభవన్ అని మీడియా సాక్షిగా చెప్పారు. కానీ, ఆ ప్రజాభవన్ కొందరికేనని శనివారం స్వయంగా గవర్నరే నిరూపించారు. గతంలో వైఎస్ షర్మిల అడిగిన వెంటనే గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆమెకు మద్దతుగా వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక బీజేపీ నేతలు అర్ధరాత్రి అడిగినా అపాయింట్మెంట్లు ఇచ్చారు. చివరకు కాంగ్రెస్ నేతలకు కూడా అడగ్గానే రాజ్‌భవన్ ద్వారాలు తెరుచుకొన్నాయి. బీఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులకు మాత్రం రోజంతా ప్రయత్నించినా గవర్నర్ దర్శనం లభించలేదు. దీనిని వివక్ష అనక ఏమంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
దేశంలో ఎక్కడేం జరిగినా.. దానిని తెలంగాణకు ముడిపెట్టి, ఇక్కడి రాజకీయాల్లో వేలుపెట్టడం గవర్నర్‌కు ఇటీవల అలవాటైందనే విమర్శలు ఉన్నాయి. అమె తరుచూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తుండటం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా మాట్లాడటం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. మరిప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీపై స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే అనుచిత వ్యాఖ్యలు చేసినా గవర్నర్ గొంతు మూగబోయిందా?’ అని తెలంగాణ మహిళా లోకం ప్రశ్నిస్తున్నది. మహిళలను అవమానించేలా మాట్లాడిన వ్యక్తులకు మద్దతు పలికేలా గవర్నర్ తీరు ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వేర్ ఈజ్ గవర్నర్..’ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
బండి సంజయ్‌పై ఫిర్యాదును కూడా తీసుకొనేందుకు గవర్నర్ స్పందించలేదు. గంటల తరబడి బీఆర్ఎస్ నేతలను గేటు బయటే ఉంచడంతో ఆగ్రహించిన మహిళలు నిరసనకు దిగారు. అప్పటికీ గవర్నర్ నివాసం తలుపులు తెరుచుకోకపోవటంతో రాజ్‌భవన్ గోడలకు వినతపత్రాలు అంటించి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. ‘ప్రజాదర్బార్ అన్నప్పుడు.. ఎవ్వరొచ్చినా వినతులు తీసుకోవాల్సిందే. బీఆర్ఎస్ నుంచి వస్తే తీసుకోరా? మేము కొట్లాడటానికి రాలేదు. కేవలం ఫిర్యాదు ఇవ్వడానికి మాత్రమే వచ్చాం. షర్మిల అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము మహిళా కార్పొరేటర్లు అడిగినా మాకు అపాయింట్మెంట్ ఇవ్వరా?’ అంటూ ఆగ్రహం వక్తం చేశారు.
ఎమ్మెల్సీ కవితను విచారణ పేరుతో బీజేపీ వేధిస్తుండటాన్ని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శనివారం తీవ్రంగా ఖండించారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గవర్నర్ తమిళిసై స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘మహిళా దినోత్సవ వారోత్సవాల్లో పాల్గొంటున్న గవర్నర్‌కు మహిళపై చేసిన అనుచిత వాఖ్యలు వినిపించడం లేదా? మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా మా నాయకురాలు ఈడీకి సమాధానాలు చెప్తుంటే.. మహిళా నేతపై చేసిన అనుచిత వాఖ్యలపై స్పందిచే సమయం గవర్నర్‌కు లేదా? పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ రాజ్‌భవన్‌కు ఎకువ దూరంలో లేదు.. కనీసం ఫిర్యాదు చేయండి మేడం గవర్నర్’ అని సూచించారు.
మహిళల పట్ల అసభ్యంగా ఎవ్వరు మాట్లాడినా చర్యలు తీసుకొనే అధికారం గవర్నర్‌కు ఉన్నది. కానీ ఆమె మా మొర వినడం లేదు. హిందూత్వం గురించి మాట్లాడే బండి సంజయ్.. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఇలా మాట్లాడటానికి సిగ్గుండాలి. మహిళా దినోత్సవం వేళ మాట్లాడే మాటలా అవి? సంజయ్ వెంటనే యావత్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఫినాయిల్‌తో బండి సంజయ్ నోరు కడుక్కోవాలి. లేకపోతే మహిళలే కడుగుతారు.
– గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ మేయర్