Dasoju-Rakesh Reddy | జీఓ 46పై వైఖరి తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ జీఓ 46 బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. కోర్టు విచారణకు హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్, ఏనుగుల రాకేష్ రెడ్డి `ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 46 బాదితులను ఏడ్పించుకుంటుంది. ఈ బిడ్డలను కూడా మీ ఉత్సవాల్లో భాగస్వాములను చేసుకోవాలి` అని కోరారు.
`బీఆర్ఎస్ పార్టీ అండతో, కేటీఆర్ సహకారం తో ఈ కేసులో జీవో 46 బాధితులు విజయం సాధిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధితుల పక్షాన దండం పెట్టి ప్రాధేయపడుతున్నాం. దయచేసి ఈ నిరుద్యోగ యువత గురించి సానుకూలంగా స్పందించండి. `జనవరి 27 జరిగే విచారణ లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 46 బాధితుల పక్షాన నిలపడాలని కోరుతున్నాం. ప్రజా పాలన కాబట్టి పంతానికి పోకుండా తెలంగాణ గ్రామీణ విద్యార్థి, నిరుద్యోగ యువత పక్షాన నిలవాలి` అని దాసోజు శ్రవణ్ కుమార్, ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు.
`రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ జీవో 46 బాధితుల పక్షాన సుప్రీం కోర్టు నిలవడం శుభపరిణామం. తల్లి ఎన్నడూ తన పిల్లలను ఏడ్పించదు. కాబట్టి, తల్లి పాత్రలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మానవీయతతో ఆలోచించి తమ వైఖరి స్పష్టం చేయాలి. వచ్చే నెల 27 జరిగే విచారణ లో కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 46 బాధితుల పక్షాన నిలిచి మీ ఫ్రభుత్వాన్ని గెలిపించినందుకు వాళ్ల రుణం తీర్చుకోవాలి` అని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.
`జీవో 46 వల్ల నష్టపోయిన విద్యార్థి నిరుద్యోగులు న్యాయం జరిగే వరకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. జీవో తెచ్చిన వాళ్ళే తీసెయ్యాలని పోరాడుతుంటే జీవోను అడ్డం పెట్టుకుని లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఏ తెగులు పట్టుకుందో స్పష్టం చేయాలి` అని అన్నారు.