భువనగిరి: సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ (BRS) నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అడ్డుకుంటారనే అనుమానంతో బీబీనగర్, వలిగొండ, యాదగిరిగుట్ట, ఆలేరు, చిట్యాల మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని ఆలేరులో హౌస్ అరెస్టు చేశారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. వలిగొండ, సంగెంలో వందలాది మంది పోలీసులను మోహరించారు. కాగా, పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ ఖండించింది. నాయకులు, కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
కాగా, సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గాన్ని వదిలి, హెలికాప్టర్లో పాదయాత్రకు సిద్ధమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరి భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శించే విధంగా రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. పాదయాత్ర మార్గమధ్యంలో ఆయనకు ఎవరెవరు వంగి దండాలు పెట్టాలి, మెడలో ఎవరు దండలు వేయాలి, హారతులు ఎవరు పట్టాలి, పార్టీ కార్యకర్తల గుంపులు ఎక్కడెక్కడ నిలబడి జై కొట్టాలి.. అనే అంశాలపై ముందస్తుగానే పకడ్బందీ ప్లాన్ చేశారు. ఎంపిక చేసిన రైతులు మాత్రమే ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు వీలుగా సమావేశ స్థలాన్ని సిద్ధంచేసి పెట్టినట్టు తెలసింది. రైతు సమావేశంలో సీఎంను ఏఏ ప్రశ్నలు అడగాలనే దాని మీద ఓ ఎంపీ సమక్షంలో ఇప్పటికే వారికి శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తున్నది. పతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టడానికి మూసీ పరీవాహక ప్రాంతం వెంట పాదయాత్ర చేస్తానని తొలుత సీఎం రెవంత్‌రెడ్డి ప్రకటించారు.
పాదయాత్ర కుదింపు
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం తన పుట్టినరోజును పురస్కరించుకొని అదేరోజున మూసీ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తానని తొలుత ప్రకటించారు. సంగెం గ్రామం నుంచి మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే మూడు రోజులు చేస్తానన్న పాదయాత్ర.. ప్రజా వ్యతిరేకత కారణంగా ఒక్కరోజుకే కుదించి మొక్కుబడిగా చేపడుతున్నట్టు అర్థమవుతున్నది. ఈ మేరకు శుక్రవారం ఉదయం సంగెం నుంచి మూసీ నది కుడి ఒడ్డు నుంచి యాత్ర ప్రారంభమై, భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల వరకే పాదయాత్ర కొనసాగుతుందని, అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు యాత్ర కొనసాగిస్తారని నిర్వాహకులు ప్రకటించారు.
పర్యటనపై రైతుల్లో అసంతృప్తి
సీఎం పర్యటిస్తున్న మూసీ ప్రాంతంలోని రైతులు గురువారం పర్యటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ‘ముఖ్యమంత్రీ నువు రాకున్నా ఫర్యాలేదు.. కానీ, రుణమాఫీ చెయ్యి’ అంటూ పలుచోట్ల ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో రైతాంగం, మూసీ బాధితులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి సీఎం ప్రయాణానికి అడ్డంపడి నిరసన తెలిపే అవకాశం ఉన్నదని ఇంటెలిజెన్స్ నివేదిక అందడంతో పోలీస్ అధికారులు, కాంగ్రెస్ నేతలు జాగ్రత్తపడ్డారని తెలుస్తున్నది. సీఎం పాదయాత్ర సాగేమార్గంలో అనుమానిత రైతులను, రైతు సంఘాల, బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు.