బూర్గంపహాడ్, ఏప్రిల్ 6: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. భద్రాచలం పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సారపాకలో గిరిజనతెగకు చెందిన బూరం శ్రీనివాసరావు నివాసంలో సీఎం రేవంత్ భోజనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమలు గాని హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని, సీఎం కాన్వాయ్‌ని ఎక్కడ అడ్డుకుంటారోనని ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులను అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్టులు చేసి భద్రాచలం తరలించి అక్కడ నుంచి పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని, 14 నెలలు దాటినా ఆ హామీలు అమలు చేయకుండా ఏదో కొత్తగా.. ఆర్భాటంగా సన్న బియ్యం పంపిణీ అంటూ కొత్త పథకాలు తీసుకొస్తూ ముందుగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో సీఎం పర్యటన సారపాకలో ఉండటంతో బీఆర్ఎస్తో పాటు సీపీఎం, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్, మాల మహానాడు నాయకులు సారపాకతో పాటు భద్రాచలంలో నిలదీస్తారని అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. అక్రమ అరెస్టులు చేయించినా, నిర్బంధాలకు గురిచేసినా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని… అరెస్టులకు భయపడేది లేదని నాయకులు విమర్శించారు. అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, సారపాక పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు, బెజ్జంకి కనకాచారి, బీఆర్ఎస్ యూత్ నాయకులు చల్లకోటి పూర్ణ, సోము లక్ష్మీ చైతన్య రెడ్డి, పంగి సురేష్, బూర్గంపహాడ్ సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, భద్రాచలం సీపీఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కమిటీ సభ్యులు వెంకట్రావ్, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు కెచ్చేల రంగారెడ్డి, మాలమహానాడు నాయకులు అల్లాడి పాల్రాజ్లు తదితరులు ఉన్నారు.