మహబూబ్‌నగర్, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టనున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా నేతలు సమావేశమయ్యారు. ఎత్తిపోతల పథకం స్టార్టింగ్ పాయింట్ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. పాదయాత్ర ఎప్పుడు ప్రారంభించాలో పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి నిర్ణయిస్తామని తెలిపారు. యాత్రకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని.. ముగింపు సభకు కేసీఆర్‌ను ఆహ్వానిస్తామని చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వం మెడలు వంచుతామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నాడు వలసలకు కేరాఫ్‌గా ఉన్న పాలమూరు జిల్లాకు సాగునీరు అందించి వలసలు నివారించాలని భావించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో 90 శాతం పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. మిగిలిన పది శాతం పనులు పూర్తి చేస్తే రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టమంటే లీడర్ల కొనుగోలు పెడ్తున్నారని విమర్శించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులకు ప్రాజెక్ట్‌లపై కనీస అవగాహన లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉందని చెప్పారు. కావాలనే సర్కారు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం లేదని, కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా వట్టెం నుంచి డిండికి నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రణాళిక ఉందని, దీన్ని కాదని రూ.1,800 కోట్లతో ఏదుల నుంచి డిండికి లింకు ఇచ్చేందుకు సర్కార్ టెండర్లు ఆహ్వానించిందని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నాడు కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఆరు నెలల్లో కరివెన వరకు నీళ్లు పారించే వాళ్లమని తెలిపా రు. ఆరుగాలం కష్టపడి పండించిన మక్క లు, వరి కొనుగోలు చేయకపోవడంతో రైతు లు అరిగోస పడ్తున్నారని ఆరోపించారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్‌రెడ్డి, సురభి వాణీదేవి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఆంజనేయగౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, ఇంతియాజ్, వాల్యానాయక్, గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు పాల్గొన్నారు.