మహబూబాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): లగచర్ల బాధిత రైతులకు సంఘీభావంగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ గురువారం తలపెట్టిన మహాధర్నాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న గిరిజన రైతు ధర్నాకు చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. కోర్టు అనుమతులు పొంది త్వరలో 50 వేల మందితో మహాధర్నా నిర్వహిస్తామని స్పష్టంచేశారు. మహాధర్నా కార్యక్రమం తలపెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ధర్నాకు అనుమతి ఇస్తామని, ఏర్పాట్లు చేసుకోండంటూ చివరి నిమిషం వరకూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తకళ్లపల్లి రవీందర్రావు, సత్యవతి రాథోడ్‌తోపాటు ఇతర నాయకులకు పోలీసు అధికారులు చెప్తూ వచ్చారు. దీంతో నాయకులు ధర్నా నిర్వహించే ప్రదేశాన్ని బుధవారం పరిశీలించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించి ధర్నాకు వచ్చే రైతుల సంఖ్య, ప్రోగ్రాం వివరాలు వెల్లడించారు. బుధవారం రాత్రి 7 గంటల వరకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, తకళ్ల్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భరత్‌కుమార్‌రెడ్డి ఎస్పీ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అకడ కాలయాపన చేసిన ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఒకసారి, పెద్దల ఒత్తిడి ఉన్నదంటూ మరోసారి చెప్తూ అనుమతి నిరాకరించారు.
బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం
మహాధర్నాకు ఏర్పాట్లు చేసుకోండని చెప్పిన ఎస్పీనే అనుమతి నిరాకరించడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ, పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించారు. గిరిజన రైతులు, ఉద్యమకారులు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరకున్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాత్రి 11 గంటల వరకు ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట టెంట్ వేసి అకడే బైఠాయించారు.
భయపడ్డావా.. రేవంత్? ; కేటీఆర్ ట్వీట్
మానుకోట గిరిజన రైతు ధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఘాటుగా స్పందించారు. ‘మాటకోసారి కేసీఆర్ రావాలి అంటూ రంకెలు వేస్తున్న రేవంత్‌రెడ్డీ.. నేను మానుకోట సభకు వెళ్తానంటే ఎందుకు భయపడుతున్నవు? ’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
రేవంత్‌రెడ్డిలో వణుకు పుట్టింది
రేవంత్‌రెడ్డికి వణుకు పుట్టింది. మానుకోటలో బీఆర్ఎస్ ధర్నా చేస్తే రాష్ట్రం అంతటా ప్రజలు ధర్నాలు మొదలు పెడతారనే అనుమతి ఇవ్వడం లేదు. గిరిజనుల సమస్యలపై శాంతియుతంగా ధర్నా చేసుకుంటామంటే అనుమతి ఇవ్వకపోవడం దారుణం.
– సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ
పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణం
మహబూబాబాద్ జిల్లా గిరిజన సంఘాల నేతలు కేటీఆర్‌ను సంప్రదించడంతో కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈ విషయాన్ని మొదటనుంచీ జిల్లా ఎస్పీకి చెప్తే పర్మిషన్ ఇస్తానని చెప్పారు. తీరా ధర్నా సమయానికి అనుమతి ఇవ్వకం పోవడం దారుణం.
-పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ
హక్కులను హరిస్తున్న రేవంత్‌రెడ్డి
హక్కుల కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేసేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా హరించి వేస్తున్నది.
-తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ