హైదరాబాద్, జూలై11 (నమస్తే తెలంగాణ) : ‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతాం’.. ఇదీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ. కానీ గడచిన 18 నెలల కాలంలో దానిని అమలు చేయాలనే చిత్తశుద్ధి హస్తం పార్టీలో ఏ కోశానా లేకుండా పోయింది. కమిషన్ల నియామకం.. ఇంటింటి సర్వే నిర్వహణ.. నివేదికలు.. అసెంబ్లీలో బిల్లుల ఆమోదం వరకూ ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఇందుకు అద్దం పడుతున్నది. అంతేకాదు, కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చాలని, అది కాదంటే పార్టీ పరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని ఒకసారి, రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని మరోసారి, ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని ఇప్పుడు.. ఇలా పూటకో మాట చెప్తూ రిజర్వేషన్ల అంశాన్ని పూర్తిగా గందరగోళం చేస్తున్నది. కాంగ్రెస్ అనుసరించిన విధానాల ఫలితంగా అనేక న్యాయపరమైన సవాళ్లు ఎదురవడమే కాదు, చివరికి ఉన్న రిజర్వేషన్లే దక్కకుండా పోయే ప్రమాదం వచ్చిపడిందన్న ఆందోళన బీసీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ విధాన రహిత, లోపభూయిష్ట మార్గదర్శకాలతో రిజర్వేషన్ల అంశం పీటముడిగా మారింది.
బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, ఇంటింటి సర్వేపై రేవంత్ సర్కారు ఆది నుంచీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పేరుకు ఇంటింటి సర్వే అని చెప్పినా రాష్ట్రవ్యాప్తంగా జనాభా గణననే నిర్వహించింది. అయితే గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం సర్వే నిర్వహించాలన్నా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంది. 1952 రిజిస్ట్రార్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, గణాంకాల సేకరణకు ఒక ప్రభుత్వశాఖను నోడల్ డిపార్ట్మెంట్గా నియమించడంపాటు, నోడల్ ఆఫీసర్‌ను, కమిషన్‌కు సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. నేషనల్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఎస్ఎస్వో తదితర విభాగాల నుంచి రాష్ర్టానికి చెందిన తాజా ఇండ్ల జాబితాను, బ్లాక్‌వారీగా రూపొందించిన హౌసింగ్ మ్యాపులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సర్వే ప్రశ్నావళి రూపకల్పనకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. సేకరించిన డేటాను కూడా అందుబాటులో ఉన్న ప్రామాణికమైన డాటాను ఓటర్, ఆధార్ జాబితాలు, రేషన్‌కార్డుదారులు తదితర వాటితో విశ్లేషించాల్సి ఉంది.
ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ ఉపాధి, రాజకీయ అవకాశాలకు సంబంధించిన స్థితిగతులను తులనాత్మక అధ్యయనం చేయాల్సి ఉంది. చివరికి అన్నింటినీ క్రోడీకరించి, విశ్లేషించి తుది నివేదికను రూపొందించాలి. క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది. తుదకు కేంద్రం ఆమోదంతో ఆ గణాంకాలను ప్రామాణికంగా పరిగణలోకి తీసుకునే అవకాశముంటుందని న్యాయకోవిదులు, నిపుణులు, బీసీ మేధావులు చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ నిబంధనలన్నింటికీ తిలోదకాలిచ్చింది. సర్వే బాధ్యతలను ప్రత్యేక కమిషన్‌కు కాకుండా, ప్లానింగ్ డిపార్ట్మెంట్కు పూర్తిగా అప్పగించింది. ఈ మేరకు జీవో 18ని విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టమైన వివరాలను ఎక్కడా పేర్కొనలేదు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వే (సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కులాల వారీగా) అని మాత్రమే పేర్కొన్నది. ఎందుకోసం చేస్తున్నామనేది ఎక్కడా పేర్కొనలేదు. క్యాబినెట్, ఆపై అసెంబ్లీలో చేసిన తీర్మానాలను మాత్రమే రెఫరెన్స్‌గా ఇచ్చింది. కానీ సమగ్ర ఇంటింటి సర్వే కోసం బీసీ సంక్షేమశాఖ మార్చి నెలలో జారీచేసిన జీవో 26ను మాత్రం ఎక్కడా రిఫర్ చేయలేదు. అంతేకాకుండా బీసీ కమిషన్‌కు టీవోఆర్లను నిర్దేశిస్తూ జీవోలను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా బీసీ కమిషన్‌కే బీసీ రాజకీయ రిజర్వేషన్ల స్థిరీకరణ బాధ్యతలను సర్కారు అప్పగించింది. ఆ తరువాత హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చి, అక్షింతలు వేశాకే, నిబంధనల మేరకు డెడికేటెడ్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం గమనార్హం. ఇదీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేమికి నిదర్శనంగా నిలుస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం నిరుడు నవంబర్ 6 నుంచి 26 వరకు తొలిదశ ఇంటింటి సర్వేను నిర్వహించింది. ఎన్యుమరేటర్లకు ఎలాంటి జనాభా సమాచారాన్ని, సర్వే చేపట్టాల్సిన ఇండ్లకు సంబంధించిన వివరాలను అందివ్వలేదు. కేవలం సర్వే పత్రాలను మాత్రమే అందజేసింది. ఎన్యుమరేటర్లే ఇంటింటికీ వెళ్లి ఆయా కుటుంబ సభ్యులు చెప్పిన కులం, వృత్తి, ఆస్తులు, ఆదాయ వివరాలనే నమోదు చేసుకున్నారు. ఆ వివరాలు సరైనవేనా? కాదా? అనేది క్షేత్రస్థాయిలోనే కాదు పైస్థాయిలోనూ తెలుసుకున్న దాఖలాల్లేవు. సూటిగా చెప్పాలంటే పూర్తిగా గృహయజమానులు ఇచ్చే సమాచారం మీదనే ఆధారపడి వివరాలను సేకరించారు. అటు తరువాత ప్రభుత్వం సర్వే నివేదికను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం జనాభా 3.7 కోట్ల మంది కాగా, వారిలో 16 లక్షల మంది (3.1శాతం) సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54కోట్ల మంది వివరాలను సేకరించినట్టు నివేదించింది. అందులో బీసీ జనాభా 46.25 శాతం, ముస్లిం బీసీలు 10.08 శాతం, ఓసీ 15.79 శాతం, ఎస్టీలు 10.45 శాతంగా నిర్ధారించింది. కానీ పట్టణ జనాభా, గ్రామీణ జనాభా ఎంత? వృద్ధులు ఎందరు? యువకులు ఎందరు? విద్యార్థులు ఎందరు? దివ్యాంగులు ఎందరు? క్యాటగిరీల వారీగా వివరాలను స్థూలంగానైనా ప్రకటించలేదు. అంతేకాదు ప్రస్తుతం స్థూలంగా వెల్లడించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాలకు జనాభా తరహాలో జిల్లాల వారీగా కూడా ప్రభుత్వం గణాంకాలను వెల్లడించలేదు. కేవలం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గణాంకాలే వెల్లడించి మేం చెప్పిందే లెక్క అన్నచందంగా వ్యవహరించింది. అసెంబ్లీలో ఆ గణాంకాలను వెల్లడించి తీర్మానం చేసింది. గణాంకాలపై విమర్శలు రావడంతో ప్రభుత్వం 2025 ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీవరకు రీ సర్వేను నిర్వహించింది. ఈ క్రమంలో మరో 21వేల కుటుంబాల వివరాలను సేకరించింది. ఇప్పుడైనా వెల్లడించిందా అంటే అదీ లేకుండా పోయింది. ఇప్పటికీ కులాలు, ఉపకులాల వారీగా జనాభా లెక్కలను ప్రకటించలేదు. కేవలం స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాల గణాంకాలనే బయటపెట్టింది.
ఇదిలా ఉంటే బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశంల్లో 2 బిల్లులను ప్రవేశపెట్టింది. అందులోనూ ఇష్టారీతినే వ్యవహరించింది. బిల్ నంబర్ 3 ద్వారా విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించింది. అయితే వాస్తవంగా జాతీయస్థాయిలో 1993లో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ చట్టం చేశారు. ఆ చట్టాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు యథాతథంగా అమలు చేసేందుకు చట్టాలు రూపొందించుకున్నాయి. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర బీసీ కమిషన్లను ఏర్పాటు చేసుకున్నాయి. ఇక బీసీ కమిషన్లు చేయాల్సిన విధులు ఏమిటంటే, ఓబీసీ వర్గాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేయడం. మండల్ కమిషన్ సిఫారసుల మేరకు బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు చేస్తున్న 27శాతం రిజర్వేషన్లను పర్యవేక్షించడం, సమీక్షించడం. అదేవిధంగా బీసీ కులాల జాబితాల్లో గ్రూపుల్లో ఒక కులాన్ని చేర్చడం, లేదంటే తొలగించడానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు సిఫారసులు చేయడం ప్రధాన విధులు. కానీ ప్రస్తుతం బీసీ కమిషన్ నివేదిక లేకుండానే బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేయడం కొసమెరుపు. ఇక బిల్ నంబర్ 4 ద్వారా రాజకీయ రిజర్వేషన్లను పెంచింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు అంటూ బిల్లులో ఉటంకించింది.
విద్యా, ఉపాధి, ఉద్యోగ రిజర్వేషన్ల కల్పనకు డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం చేసి, సిఫారసులు చేసేందుకు ఎక్కడా అధికారాలు లేవు. ప్రభుత్వం కూడా ఆ మేరకు డెడికేటెడ్ కమిషన్‌కు మార్గదర్శకాలు జారీ చేయకపోవడం గమనార్హం. అయినప్పటికీ డెడికేటెడ్ కమిషన్ నివేదికనే ప్రామాణికంగా తీసుకుని చట్టాన్ని రూపొందించడం ప్రభుత్వ చిత్తశుద్ధిలేమికి అద్దం పడుతున్నది. ప్రభుత్వం అనుసరించిన విధానాలతో మొత్తంగా గందగోళంగా మారింది. ఇదిలా ఉంటే బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికలను సైతం ప్రభుత్వం ఇప్పటికీ బహిర్గతపరచలేదు. అంతేకాదు కమిషన్ కేవలం పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల స్థిరీకరణకు సంబంధించిన నివేదికనే తెప్పించుకుంది. మున్సిపాల్టీలకు సంబంధించిన నివేదికను ఇప్పటికీ ఆ కమిషన్ ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. కానీ ప్రభుత్వం ఆ ఒక్క నివేదికనే ఆధారంగా పంచాయతీ, మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేసింది. ఇప్పటికీ కమిషన్ ఇచ్చిన నివేదికలను కూడా బయటపెట్టలేదు. అంతేకాదు రీ సర్వే గణాంకాలను డెడికేటెడ్ కమిషన్‌కు ప్రభుత్వం అందించిందా? లేదా? కమిషన్ నుంచి మరోసారి నివేదికను తీసుకున్నారా? లేదా? అనేదానిపై సర్కారు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అదీగాక తాజాగా చేసిన చట్టంలో బీసీ రిజర్వేషన్లలో ఏ క్యాటగిరీ వాటా ఎంతనేది కూడా సర్కారు ప్రకటించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అశాస్త్రీయంగా, అహేతుకమైన గణాంకాలతో, అశాస్త్రీయ పద్ధతులతో కావాలనే చట్టాన్ని చేసి మమ అనిపించుకున్నది తప్ప మరేమీ లేదు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లపై పూటకో మాట చెప్తున్నది. బీసీ బిల్లులు ఆమోదానికి చేపట్టాల్సిన న్యాయపరమైన ప్రక్రియను చేపట్టలేదు. కానీ వెంటనే ఆ బిల్లులను కేంద్రం ఆమోదించి 9వ షెడ్యూల్డ్ చేర్చాలని డిమాండ్ ఎత్తుకుంది. అనుకూల బీసీ సంఘాలను వెంటపెట్టుకుని పోయి ఢిల్లీలో ధర్నా నిర్వహించింది. బిల్లులు చేశాం.. బాధ్యత తీరింది.. కేంద్రం ఆమోదిస్తే అమలు చేస్తాం.. అన్న రీతిలోనే వ్యవహరించింది. ఆ తరువాత రాజ్యాంగబద్ధంగా కాకపోతే పార్టీ పరంగానైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటివరకు బిల్లుల ఆమోదానికి ఎలాంటి చర్య చేపట్టలేదు. తాజాగా ఆర్డినెన్స్ ద్వారా బిల్లులను అమలు చేయాలని, బీసీలకు రిజర్వేషన్లకు కల్పించాలని రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయించారు. వాస్తవంగా రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. తీసుకున్నా అవి చెల్లబోవని న్యాయనిపుణులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం పూటకోమాట చెప్తూ రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తాన్ని పీటముడిగా మార్చింది. గందరగోళ పరిస్థితి సృష్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదిడ్డంగా అనుసరించిన విధానాలు, జారీచేసిన మార్గదర్శకాలు, ఉత్తర్వులతో బీసీ రిజర్వేషన్ల చట్టాలకు న్యాయచిక్కులు తప్పవని బీసీ మేధావి వర్గాలు, న్యాయకోవిదులు హెచ్చరిస్తున్నారు. బీహార్‌తోపాటు, మహారాష్ట్ర ఉదంతాలను ఉదహరిస్తున్నారు. సుప్రీంకోర్టు గతంలో విధించిన 50శాతం కోటా పరిమితిని సంగతేమో కానీ సర్వే గణాంకాలే ప్రామాణికత లేకుండా పోయాయని వివరిస్తున్నారు.
రాష్ర్టాలు నిర్వహించిన, నిర్వహిస్తున్న కులగణన సర్వేలకు పారదర్శకత లేదని కేంద్ర క్యాబినెట్ సూపర్ కమిటీగా పేరొందిన ప్రధాని మోదీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) ఇటీవల తేల్చిచెప్పింది. కులగణన అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోనిదేనని నొక్కిచెప్పింది. రాజకీయ కారణాలతోనే చేపట్టారని కుండబద్దలు కొట్టింది. రాష్ర్టాలు నిర్వహించే కులగణన సర్వేలకు పారదర్శకత కానీ, ఆ గణాంకాలకు సాధికారత కానీ ఉండబోదని కుండబద్దలు కొట్టిమరీ చెప్పింది. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనాభా గణనలో కులగణనను కూడా నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే కేంద్రం ఇటీవలనే కులగణన షెడ్యూల్‌ను సైతం ప్రకటించింది.