K Keshava Rao | తన తండ్రి కే.కేశవరావు బీఆర్ఎస్ పార్టీని వీడటం బాధగా ఉందని ఆయన కుమారుడు విప్లవ్‌కుమార్ అన్నారు. ఈ వయసులో పార్టీ మారడం ఏంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక సీనియర్ నాయకుడిగా అధినేత కేసీఆర్‌కు అండగా ఉండాల్సిందిపోయి.. పార్టీని వీడటం సరికాదని సూచించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విప్లవ్‌కుమార్ మాట్లాడారు.
కేశవరావు పదవుల కోసం కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని తాను అనుకోవడం లేదని విప్లవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ వయసులో ఆయనకు ఎలాంటి పోస్టులు అవసరం లేదని.. తన జీవితంలో ఎన్నో పదవులను అనుభవించారని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఆయన అవసరం ఉందని విప్లవ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో కేసీఆర్‌కు సలహాదారుడిగా ఉండి.. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సిందని చెప్పారు. పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఈ వయసులో పార్టీ మారడమేంటని ఆయన గురించి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడారని.. ఇప్పుడు కేశవరావును ఎలా పార్టీలోకి పిలిచారని ప్రశ్నించారు. ఇన్నేండ్లు ఒకే పార్టీలో తామంతా సంతోషంగా ఉన్నామని.. కానీ ఇప్పుడు తమ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి విభజించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ మారే ఆలోచనపై పునరాలోచన చేయాలని కేశవరావును విప్లవ్‌కుమార్ రిక్వెస్ట్ చేశారు. బీఆర్ఎస్లోనే కొనసాగాలని కోరారు. ప్రస్తుతం పార్టీకి మీరు కావాలని.. మీకు పార్టీ కావాలని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ నుంచే రాజకీయాల్లోకి వచ్చారని ఆయన గుర్తు చేశారు. 2016, 2021లో కార్పొరేటర్‌గా ఎంపికయ్యారని.. పార్టీ అధినేత ఆమెను జీహెచ్ఎంసీ మేయర్‌ను చేశారని అన్నారు. పార్టీ మనకు ఎంత చేసినప్పుడు మనం పార్టీతోనే ఉండటం సమంజసమని అన్నారు. ఆత్మగౌరవం ఉంటే పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు.
దానం నాగేందర్ నమ్మదగిన మనిషి కాదని విప్లవ్ కుమార్ తెలిపారు. ఆయన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని.. ఆయన ఎప్పుడూ ఒక పార్టీలో ఉండరని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే అందులోకి వెళ్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తనకు తండ్రి కంటే ఎక్కువ.. ఆయన కోసం ఏమైనా త్యాగం చేస్తా అని మాట్లాడిన దానం నాగేందర్.. ఇప్పుడు పార్టీ మారారని అన్నారు. పార్టీని వదిలి వెళ్లే వాళ్లు తమ పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు.