హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెం ట్ ఇస్తున్న కేసీఆర్ కావాలో? కేవలం 3 గం టలు, 5 గంటలు విద్యుత్తు ఇస్తామన్న రేటెంతరెడ్డి కాంగ్రెస్ కావాలో? కర్ణాటక కాంగ్రెస్ కావాలో? తెలంగాణ సమాజం అలోచించాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సూచించారు. రేటెంతరెడ్డికి, డీకే శివకుమార్ వంటి గజదొంగలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఉచిత కరెంట్ విషయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా దొంగలా పట్టుబడ్డారని, తాము 5 గంటల కరెంటే ఇస్తున్నామని డీకే స్వయంగా చెప్పడం తెలంగాణ సమాజం ప్రత్యక్షంగా చూసిందని వెల్లడించారు. ఆదివారం తెలంగాణ భవన్లో శ్రవణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నాయకులను రప్పించి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ను కర్ణాటకకు రావాలని సవాల్ చేసిన డీకే శివకుమార్.. తెలంగాణలో ఏదైనా ఇంటిని సందర్శించి, ఏ ముసలవ్వనైనా పెన్షన్ ఎంత వస్తున్నదని అడిగితే ఆయనకు మూతిపగలగొట్టే సమాధానం ఇస్తారని చెప్పారు. కర్ణాటకలో రైతుబంధు, బీమా, రుణమాఫీ లేవని, మరి ఏ మొహంతో తెలంగాణలో ప్రచారం చేస్తున్నారని? నిలదీశారు. తెలంగాణలోని ప్రతి పల్లె అద్భుతంగా తయారైందని గుర్తుచేశారు. మరి కర్ణాటక పల్లెల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సొంత ఇంటిని బాగు చేసుకోలేని డీకే.. తెలంగాణపై బుదరజల్లే ప్రయత్నం మానుకోవాలని హితవుపలికారు. సొంత పార్టీ నాయకులకే టికెట్లు అమ్ముకునే నాయకుడు.. రాష్ట్రాన్ని ఏ రకంగా అమ్మకొని తింటాడో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.