హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఏక్ పోలీస్ వ్యవస్థపై తక్షణం కమిటీ వేయాలని, సస్పెండ్ చేసిన బెటాలియన్ కానిస్టేబుళ్లను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళనలు చేస్తున్న పోలీసుల కుటుంబసభ్యులను పోలీసులే ఈడ్చి పడేస్తున్న వైనాన్ని ఆయన ఎక్స్ వేదికగా ఖండించారు. ‘తమ భర్తలకు, కుటుంబాలకు న్యాయం కోసం పోరాడుతున్న కానిస్టేబుల్ భార్యపై యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ చేయిచేసుకునే స్థాయికి పోలీసు డిపార్ట్మెంట్ను దిగజార్చారు రేవంత్ రెడ్డి గారు. తమరు నిజంగా చరిత్రలో నిలిచిపోతారు. టీజీఎస్పీలో కొత్తగా ప్రవేశపెట్టిన ‘పర్మిషన్ విధానాన్ని’ రద్దు చేయండి. ఏక్ పోలీసు వ్యవస్థపై కమిటీని ఏర్పా టు చేయండి. అన్ని విభాగాలను ఒకేలా చూడండి. పోలీసు లు రోబోలు కాదు.. మనుషులు అనేది గుర్తించండి’ అం టూ ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు.