హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో గొప్పగా చెప్పిన ’ఏక్ పోలీస్’ విధానం ఏమైందని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో స్పెషల్ కానిస్టేబుళ్లకు 15 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు సెలవులు ఉండేవని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక 26 రోజులు వరుసగా డ్యూటీ చేస్తేనే 4 రోజులు లీవ్ ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీఎం కేసీఆర్ స్పెషల్ కానిస్టేబుళ్లను మనుషులుగా చూస్తే.. ఇప్పుడు రేవంత్ మరమనుషులుగా చూస్తున్నారని ఫైరయ్యారు. పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవంలో రేవంత్ పాల్గొన్న రోజే పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని, కానిస్టేబుళ్ల భార్యలు రోడ్డెక్కితే నల్లగొండలో కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం ఏమిటని ధ్వజమెత్తారు. ఆ సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 11 నెలలుగా హోంమంత్రి లేడని, ఈ శాఖను తనవద్దే పెట్టుకున్న సీఎం రేవంత్ సరిగా పర్యవేక్షించలేకపోతున్నారని, ఆయన పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. సమాజంతోపాటు ప్రజాప్రతినిధులకు, మంత్రులకు భద్రత కల్పిస్తున్న పోలీసులకు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డులు హాస్పిటల్స్‌లో పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రోజురోజుకు శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయని, హైదరాబాద్‌లో పట్టపగలే హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం నియంత్రించలేపోతున్నదని ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. అంబర్‌పేటలో రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ లింగారెడ్డి దంపతులు దారుణ హత్యకు గురై 7 రోజులైనా ఇప్పటివరకు ఒక నిందితుడిని కూడా ఎందుకు అరెస్టు చేయలేకపోయారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 10 లక్షల పైచిలుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. వాటిపై ఇప్పుడు పర్యవేక్షణ లేక దాదాపు సగం కెమెరాలు పనిచేయడం లేదని, అయినా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా నిర్వాహకులపై ఎన్ని కేసులు పెట్టారన్న అంశంపై తప్ప శాంతిభద్రతలపై రేవంత్ ఒక్క రివ్యూ అయినా చేశారా అని నిలదీశారు. పోలీసులను అడ్డంపెట్టుకొని బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజు తనకు డీజీపీ ఆహ్వానం పంపారని, ఆ రోజు తాను బయటకు వెళ్తానంటే పోలీసులు హౌస్ అరెస్టు చేశారని మండిపడ్డారు. పోలీస్ శాఖలో అశాంతి నెలకొన్నదని, ప్రజల్లో అభద్రతాభావం పెరిగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలపై అకారణంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. కేటీఆర్, హరీశ్‌రావుపై పెట్రోల్ పోసి చంపుతానని గజ్వేల్‌లో బహిరంగంగా బెదిరించిన మైనంపల్లి హన్మంతరావుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రవీణ్‌కుమార్ నిలదీశారు. కొల్లాపూర్‌లో శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి 7 నెలలైనా నిందితులను అరెస్టు చేయలేదని, ఈ హత్యలో మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం ఉన్నదని మృతుడి తండ్రి డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కేసులో ఎస్పీని బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. శ్రీధర్‌రెడ్డి హత్యలో మంత్రి జూపల్లి పాత్రపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గజ్జెల నగేశ్, ఫయాజ్, కొంకటి శేఖర్ పాల్గొన్నారు.