RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసు అధికారులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తెలిపారు. రిటైర్డ్ అయినా, ట్రాన్స్ఫర్ అయినా వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ విషయాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కూడా గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
సిద్దిపేటలో చేయని నేరానికి సోషల్‌మీడియా యాక్టివిస్ట్ మీద కేసు పెట్టారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కానీ హరీశ్‌రావు, కేటీఆర్‌ను పెట్రోలు పోసి చంపుతామన్న మైనంపల్లి హనుమంతరావు మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదని చెప్పారు. కేసు నమోదు చేయాలని మేం రిక్వెస్ట్ చేసినప్పటికీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో లీగల్ నోటీసులు పంపించి, ఇది సివిల్ కేసు అని చెప్పారని గుర్తుచేశారు. ఒక మనిషిని మరో మనిషి పెట్రోలు పోసి చంపుతామంటే సివిల్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. గాంధీ భవన్లో కేసుల స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని, పోలీసు అధికారులు వాటిని యదాతథంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని విమర్శించారు.
నకిరేకల్‌లో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మూడు కేసులు ఎలా పెడతారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ఒక్క కేసులో ఒక్క ఎఫ్ఐఆర్నే నమోదు చేయాలని కోర్టు తీర్పులు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు. పోలీసు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంచెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నిజాయతీ గల అధికారులను గుర్తించి ప్రోత్సహిస్తామని చెప్పారు. తమకు ఎలాంటి ఫేవర్ చేయాల్సిన అవసరం లేదని, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే చాలని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ఆదేశాలతో.. చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీస్ అధికారులకు బీఆర్ఎస్ నాయకులు @RSPraveenSwaero స్ట్రాంగ్ వార్నింగ్ 🔥
రిటైర్డ్ అయినా, ట్రాన్స్ఫర్ అయినా వదిలిపెట్టం. pic.twitter.com/UqpUYXqOYD
— BRS Party (@BRSparty) March 29, 2025
సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు. బీఆర్ఎస్ సోషల్‌మీడియా వారియర్స్‌పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. తప్పుచేస్తున్న పోలీసు అధికారులకు, వారి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ చేయాలన్నారు.