హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ‘గ్రూప్-1 అభ్యర్థుల కటాఫ్ మార్కులు ఎన్ని? క్యాటగిరీలవారీగా ఎంపిక కటాఫ్ మార్కులు ఎన్ని అనేది ఎందుకు చెప్పడం లేదు’ అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. 2022లో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన జీవో 55ను రద్దుచేసిన రేవంత్‌రెడ్డి సర్కారు, జీవో 29ని తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్లో మట్టికొడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యా యం జరుగుతున్నదని, వారి హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదని మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నామని రాహుల్‌గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటే ఆ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి సామాజిక న్యాయానికి తూట్లు పొడుతున్నారని విమర్శించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతోపాటు స్పెషల్ క్యాటగిరీ అభ్యర్థులకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంతోపాటు సుప్రీంకోర్టు సైతం అనేక తీర్పుల్లో చెప్పిందని గుర్తుచేశారు. కానీ, రేవంత్ సర్కారు తెచ్చిన జీవో 29 దీనికి తూట్లు పొడుస్తున్నదని తెలిపారు. జీవో 29 ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడితే రిజర్వ్ కోటాలో అన్నివర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. గ్రూప్-1లో ఓపెన్ క్యాటగిరీ అంటే అగ్రవర్ణాలవారికేనా? అని నిలదీశారు. రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులు 563కుగాను 1:50 ప్రకారం మొత్తం 28,150 మందిని ఎంపిక చేయాల్సి ఉన్నదని వివరించారు. కేసీఆర్ తెచ్చిన జీవో 55 ప్రకారం ఓపెన్ క్యాటగిరీలో 40 శాతం అంటే 209 పోస్టులకు 10,450 మందిని, రిజర్వేషన్ క్యాటగిరీలో 60 శాతం అంటే 354 పోస్టులకు 17,700 మంది ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఎంపికచేయాల్సి ఉన్నదని తెలిపారు. కానీ, బదావత్ తీర్పు ఆధారంగా హడావుడిగా జీవో 29 తీసుకొచ్చి రిజర్వేషన్ కోటాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒకే ముద్దగా 28,150 మందిని టీజీపీఎస్సీ ఎంపిక చేసిందని విమర్శించారు. ఏ వర్గాల అభ్యర్థులు ఎందరున్నారని వెల్లడించడం లేదని మండిపడ్డారు.
యూపీఎస్సీ కూడా ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో సామాజిక కోటాలను పాటిస్తున్నదని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. కర్ణాటక, హర్యానా, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, జార్ఖం డ్ రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నాయని, వీటికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డం రావడం లేదా? అని నిలదీశారు. ఓపెన్ క్యాటగిరీలో ఎంపిక చేసిన 10,400 అభ్యర్థుల్లో ఏ వర్గాలకు చెం దిన వారు ఎంత మంది ఉన్నారనే లెక్కలను ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఇదీ కాకుండా 3,232 మందిని అదనంగా ఏ ప్రాతిపదికన తీసుకున్నారనేదీ సీఎస్, టీజీపీఎస్సీ, రేవంత్‌రెడ్డి చెప్పడం లేదని మండిపడ్డారు. మెరిట్ అభ్యర్థులు అంతా ఓపెన్ క్యాటగిరీలోకి వస్తే మరో 14 వేల మంది అర్హ త పొందే అవకాశం ఉన్నదని, వీరందరికీ అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. అ అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని, లేకుంటే బీఆర్ఎస్ తరఫున మళ్లీ విజ్ఞాపనలు చేస్తామని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు తుంగ బాలు, ఆంజనేయగౌడ్, బొమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు.