RS Praveen Kumar | అచ్చంపేట : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ నేతల ఫొటోలను పోలీసు స్టేషన్లలో పెట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన జన గర్జన సభలో ఆర్ఎస్పీ పాల్గొని ప్రసంగించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా అచ్చంపేటలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఎన్నో కష్టాలు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రేవంత్ రెడ్డి కేసులు పెట్టి, రౌడీషీట్లు ఓపెన్ చేయిస్తున్నాడు.. జైల్లో పడేస్తాడట. పోలీసు స్టేషన్లలో, రౌడీషీట్లలో ఉండాల్సిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రజల పక్షా పోరాడుతున్నా మనం కాదు.. నిలువునా దోచుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ నేతల బొమ్మలు పోలీసు స్టేషన్లలో ఉండాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద ఘోరాలకు పాల్పడుతున్నారు. దళితులపై అత్యాచారాలు జరిగేది యూపీలోనే అది తెలిసీ బీజేపీలోకి వెళ్లారా..? అని గువ్వల బాలరాజును నిలదీశారు ఆర్ఎస్పీ. మధ్యప్రదేశ్‌లో దళితులపై మూత్రం పోసి అవమానించారు ఈ బీజేపీ నేతలు. రోహిత్ వేములను చంపింది కూడా బీజేపీనే. ఈ కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి మళ్లీ తెలంగాణను దోచుకుని మన భవిష్యత్‌ను నాశనం చేసేందుకు వచ్చాయి. పాలమూరు ఎత్తిపోతల పనులను కేసీఆర్ 90 శాతం పూర్తి చేస్తే, మిగిలిన 10 శాతం పనులను నిధులు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అడ్డగించారు. మరి ఎవరు నిజమైన పాలమూరు బిడ్డ.. రేవంతా..? కేసీఆరా..? చేతులు జోడించి కోరుతున్నా రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడించి మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. బరాబర్ ఈ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించాలి అని అచ్చంపేట ప్రజలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.