హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రజాసమస్యలపై సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎదుర్కోలేని కాంగ్రెస్ సర్కార్.. ఆయనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నదని పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించేందుకు దుర్మార్గపు ఎత్తుగడలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్‌రావుపై విచారణ పేరిట ఒత్తిళ్లకు గురిచేస్తున్నదని ఆరోపించారు. ప్రతినిత్యం సమస్యలపై గళమెత్తుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై తప్పుడు కేసులు బనాయించి అణచివేసేందుకు సర్కార్ యత్నిస్తున్నదని మండిపడ్డారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ నేతలు వాసుదేవారెడ్డి, కే కిశోర్‌గౌడ్, తుంగ బాలు, మొహిసిన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ద్వారా గ్యాలంట్రీ అవార్డు అందుకున్న ప్రభాకర్‌రావును ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణ పేరిట పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎన్నడూ చూడని విధంగా ఒక నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్‌ను 14 రోజులు పోలీసుల కస్టడీలో విచారణ చేయడం బాధాకరమని పేర్కొన్నారు. సర్వసాధారణమైన ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ సర్కార్ తెలుగు డెయిలీ సీరియల్లా సాగదీస్తున్నదని మండిపడ్డారు.
ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని ప్రవీణ్‌కుమార్ విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ప్రభాకర్‌రావుపై వ్యక్తిగత దూషణలకు దిగిన ఆయన.. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు. తన సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్, హరీశ్‌రావును అక్రమ కేసుల్లో ఇరికించేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నారని ధ్వజమెత్తారు. ఫోన్‌ట్యాపింగ్‌పై మొదట ఏర్పాటుచేసిన సిట్ 350 మంది సాక్షులను విచారించినా ఏమీతేల్చలేకపోయిందని చెప్పారు.
దీంతో కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధించేందుకే మళ్లీ నలుగురు సీనియర్ ఐపీఎస్‌లతో సిట్ వేసి విచారణను సాగదీస్తున్నారని ఆరోపించారు. ఫోన్‌ట్యాపింగ్ కొత్తదేమీకాదని, వేగుల వ్యవస్థ పురాతన కాలం నుంచే ఉన్నదని గుర్తుచేశారు. ప్రభుత్వాలు నేరాలను అరికట్టేందుకు ఫోన్‌ట్యాపింగ్ చేయడం సర్వసాధారణమని, ఇందులో భాగంగానే 1885లోనే టెలిగ్రాఫ్ యాక్ట్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇదేదో పెద్ద నేరంగా చిత్రీకరిస్తున్న ముఖ్యమంత్రి తన సహచర మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయించడంలేదా? అని ప్రశ్నించారు. వాస్తవానికి సిట్ వేయాల్సింది రేవంత్రెడ్డిపైనేనని స్పష్టంచేశారు.
మహిళా ఐఏఎస్ అధికారిని ఓ సీనియర్ మంత్రి వేధిస్తున్నట్టు మీడియాలో వార్తలు రావడం దురదృష్టకరమని ప్రవీణ్‌కుమార్ వ్యా ఖ్యానించారు. పాలనా వ్యవహారాలు చూడాల్సి న మంత్రులు దిగజారి ప్రవర్తిస్తూ తెలంగాణకు తలవంపులు తెస్తున్నారని విమర్శించారు. ఏపీ అక్రమంగా నీళ్లు తరలించుకుపోతుంటే చోద్యం చూస్తున్న అమాత్యులు.. అక్రమ వ్యవహారాల్లో మునిగితేలుతున్నారని దెప్పిపొడిచారు.