BRS Party | హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈ దాడులపై కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో కలిసి డీజీపీ రవి గుప్తాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలోనే విచక్షణారహితంగా పట్టపగలు దాడులకు తెగబడుతున్నరు. అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయింది. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతుంది. అచ్చంపేటలోనే పుట్టి పెరిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయనకు తెలవదని నేను అనుకోను. మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డికి ప్రాణ హానీ ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో దాడులకు చోటివ్వలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. దాడిలో గాయపడ్డ బాధితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాధుడే లేడు. గువ్వల బాలరాజుకు, తనకు ప్రాణహాని ఉంది. రక్షణ ఇవ్వాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేశాం. బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. దాడిలో గాయపడి చికిత్స తీసుకుంటున్న వారి దగ్గరికి వచ్చి ప్రాణహాని ఉందని నేరుగా పోలీసులే చెప్తున్నారని బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.