హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): జయజయహే తెలంగాణ గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది ‘నాటు నాటు’ పాట కాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల మంది ప్రజల కలల ప్రతిరూపం అని మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడి పెత్తనమేంది.. అంటూ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చి పదేండ్లయిననా ఈ ప్రాంత కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంతకాలమని సందేహాన్ని వ్యక్తంచేశారు. రణనినాదం, ధికార స్వరమైన అందెశ్రీ ఇచ్చిన ఒరిజినల్ ట్యూన్‌తోనే గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలపించిందని తెలిపారు.
ఉస్మానియాలో 2011 జనవరి 3న విద్యార్థి గర్జనలో లక్షలాది మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలపించిన తీరు చూసుంటే రేవంత్‌రెడ్డి ఈ దుస్సాహసం చేయరని, ఆయన అకడ ఉండే అవకాశం లేదు కాబట్టే బహుశా ఆయనకు ఇది తెలియదని తెలిపారు. తాను ఆ రోజు అకడ ఉన్నందునే ఈ విషయం చెప్తున్నానని స్పష్టం చేశారు. అందెశ్రీ అమాయకుడు, నిస్సహాయుడని అందుకే మౌనంగా కూర్చున్నాడని, మీరేం చేసినా భరిస్తున్నాడని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ధ్వజమెత్తారు. ‘తెలంగాణ ప్రజలారా, జూన్ 2నాడు ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందామా, లేక మన ఒరిజినల్ గీతాన్నే పాడుకుందామా’ అంటూ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు.
ఆంధ్ర సంగీత విద్యాంసులు ఎంతగానో మీకు ఇష్టమైతే, ఆకట్టుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వెళ్లి అక్కడే ముఖ్యమంత్రి కావాలని రేవంత్‌రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుంటే తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించి ఈ ప్రాంతీయుల ప్రతిభను ప్రోత్సహించాలని తెలిపారు. ఉమ్మడి ఏపీలో దోపిడీ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో ఎన్నో తరాలు ఉద్యమాలు చేసి అనేకమంది తమ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. జనగణమన, వందేమాతరం గేయాలకు ట్యూన్ ఇచ్చింది హాలీవుడ్ దర్శకులు కాదనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. టాలీవుడ్ వేరు తెలంగాణ ఉద్యమం వేరని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ వినోదం కోసమని కానీ తెలంగాణ గీతం అనేది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఈ ప్రాంత ప్రజల హృదయాలందరినీ ఒక చోట చేర్చిన భావోద్వేగాల గేయమని పేర్కొన్నారు.