RS Praveen Kumar | అచ్చంపేట : అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను ఎంపీ కావాలని బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆర్ఎస్పీ పాల్గొని ప్రసంగించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా నాకు కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఎంపీ టికెట్ ఇచ్చారు అని గువ్వల బాలరాజు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. నేను ఎంపీ కావాలని బీఆర్ఎస్లోకి రాలేదు. కేసీఆర్ ఆలోచనా విధానం, ఉద్యమించి తెలంగాణను సాధించిన విధానం, కేవలం 10 ఏండ్లలోనే బంగారు తెలంగాణగా మార్చిన విధానం నచ్చి పార్టీలోకి వచ్చాను అని ఆర్ఎస్పీ స్పష్టం చేశారు.
నాకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తానని రేవంత్ రెడ్డినే ఓ వేదికపై చెప్పాడు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి కూడా ఇస్తానని చెప్పాడు. కానీ నేను ఆ పదవులకు ఆశ పడలేదు. కేసీఆర్కు మాట ఇచ్చాను. ఆ పార్టీ వెంబడే నడుస్తానని చెప్పాను. అధికారం లేకున్నా కేసీఆర్ వెంటే ఉంటానని చెప్పాను. నేను ఎంపీ టికెట్ అడగలేదు. దానికి సాక్ష్యం గువ్వల బాలరాజు కూడా. పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. అణిచివేయబడ్డ వర్గాల కోసం, వారి బాగు కోసం వచ్చాను. కేసీఆర్ సీఎం అయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతంది. మంత్రి, ఎంపీ పదవుల కోసం రాలేదు. ఏడు సంవత్సరాల ఐపీఎస్ పదవి ఉండగానే వచ్చాను. ఇతర రాష్ట్రాల్లో నా మిత్రులు డీజీపీలుగా ఉన్నారు. ఒక వేళ సర్వీసులో ఉంటే నాకు కూడా డీజీపీ హోదా వచ్చేది. నేను డీజీపీ అయితే నాకేం లాభం.. నా స్వార్థం కోసం కాదు.. బలహీన వర్గాల ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ అంతా ఇక్కడే ఉన్నది. పార్టీలు అంటే ఫ్లెక్సీల మీద ఫొటోలు కాదు, డీపీలు పెట్టుకోవడం కాదు, స్టేటస్ కాదు.. ఆది నాయకుడి వెంబడి నిలబడే వ్యక్తే నిజమైన కార్యకర్త. పదవులు ఇవ్వలేదని అలిగిపోయే వాడు కార్యకర్త కాదు అని గువ్వల బాలరాజుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చురకలంటించారు.