RS Praveen Kumar | హైదరాబాద్ : కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సీ గురుకుల విద్యార్థుల పట్ల చూపిస్తున్న వివక్షపై ఆయన మండిపడ్డారు. విద్యార్థులే టాయిలెట్లు శుభ్రం చేసుకోవాలి.. వాళ్ల వంటలు వాళ్లే చేసుకోవాలన్న అలుగు వర్షిణి వ్యాఖ్యలను కూడా ఆర్ఎస్పీ తీవ్రంగా ఖండించారు.
రేవంత్ రెడ్డి గారు.. మీరే మంత్రిగా ఉన్న సాంఘీక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారి డా. అలుగు వర్షిణి.. దళిత విద్యార్థులు సంపన్న వర్గాల నుండి రాలేదు కావున హాస్టల్స్లో వారి టాయిలెట్స్ వాళ్లే శుభ్రం చేసుకోవాలి, వాళ్ల వంటలు వాళ్ళే చేసుకోవాలి, ఇందులో తప్పేముంది అని బహిరంగంగా హుకుం ఇచ్చారు. దీన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులను బయటకు గెంటేయండి అని చెబుతున్నారు. ఈ లాంటి ‘మంచి’ అలవాట్లు విద్యార్థులకు భవిష్యత్లో చాలా బాగా పనికొస్తాయని వారు గట్టిగా సమర్థించుకుంటున్నారు కూడా. పైగా దీన్ని రాజకీయం కూడా చేయొద్దు అని వారు హెచ్చరిస్తున్నారు.
మీ ఆదేశాలు లేకుండా ఏ అధికారి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. తరతరాలుగా మా టాయిలెట్లు మేం కడుక్కుంటూనే ఈ నిచ్చెనమెట్ల సమాజం టాయిలెట్లు కూడా మేమే కడుగుతున్నాం. అయినా ఇన్ని గొప్ప మనువాద సంస్కరణలు మా పేద విద్యార్థులకేనా? మీ పిల్లలు చదివే కార్పొరేట్ స్కూల్స్లో కూడా అమలు చేయాలని మీ అధికారులకు చెప్పండి. అలాగే ముఖ్యమంత్రిగా, సంక్షేమ మంత్రిగా, సంపన్న వర్గాల ప్రతినిధిగా మీరు కూడా మీ టాయిలెట్ ఈ రోజు నుండే కడుక్కోండి, మీ మంత్రులతో, అధికారులతో కడిగించండి, గాంధీ భవన్లో మీ సహచరులతో కడిగించండి. ప్రతి రోజూ ఆ ఫోటోలను వీడియోలను తెలంగాణ ప్రజలతో షేర్ చేసుకోండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
రేవంత్ రెడ్డి గారి బంగళాకు ఈ రోజు నుండి పోవడం మానేయాలని హౌస్ కీపింగ్ సోదరులకు మనవి. ప్రతిరోజూ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా తూట్లుపొడుస్తున్నా, నిలదీయకుండా నిస్సిగ్గుగా అందులో బానిసలుగా కొనసాగుతున్న మా ఎస్సీ ఎస్టీ సోదరులు మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహకు ఈ పోస్టు అంకితం అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. జై భీం.. జై తెలంగాణ.. అని ఆర్ఎస్పీ నినదించారు.