RS Praveen Kumar | హైదరాబాద్ : భర్తను కోల్పోయి బాధలో మాగంటి సునీత కన్నీళ్లు పెడితే డ్రామా, సీరియల్ అంటూ అవమానిస్తున్న కాంగ్రెస్ మంత్రుల తీరు దుశ్శాసనుడిని మించిపోయింది అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్లైనా గెలవాలని మహిళలను అవమానించేలా ఘోరమైన సంస్కృతికి తెరలేపింది కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు. ఇందిరా గాంధీ చనిపోతే చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు మీ దృష్టిలో అది కూడా సీరియల్, డ్రామానేనా? అని ఆర్ఎస్పీ నిలదీశారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
పొన్నం ప్రభాకర్ అన్న మాటలు చూస్తే.. ఇలాంటి మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అని అనిపిస్తుంది. మాగంటి సునీత కన్నీళ్లు పెడితే డ్రామాలు చేయడం అందరికీ వచ్చు.. ఇది సినిమా కాదు సీరియల్ కాదు అనడం సరికాదు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు చాలా మంది కన్నీళ్లు పెట్టారు.. అది కూడా డ్రామాలేనా..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
మాగంటి సునీత జామా మసీదు ఎదుట రోడ్డు మీద నిలబడి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచితే కేసు నమోదు చేశారు. ఆమె మసీదులోకి వెళ్లలేదు, రోడ్డు మీద నిలబడి ప్రచారం చేయడం ఏ రకంగా నేరం అవుతుంది. డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు చేయగానే వెంటనే మాగంటి సునీత మీద, ఆమె కూతురు చిన్న అమ్మాయి అక్షర మీద కేసు నమోదు చేశారు. అలానే ఇతరులు అని మెన్షన్ చేశారు.. ఎందుకంటే ఇంకెవరైనా బీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో తిరిగితే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైళ్లలో వేయాలని చూస్తున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
మాగంటి సునీత కన్నీళ్లు పెడితే అది ఒక డ్రామా, సీరియల్ అని అన్న పొన్నం ప్రభాకర్‌కు మహిళా కమిషన్ ఛైర్మెన్ నేరెళ్ల శారద నోటీసులు ఇచ్చారా? కేటీఆర్ మహిళలు బస్సులో ప్రయాణిస్తుంటే చేయని కామెంట్‌కు ఆయనకు నోటీసులు ఇచ్చి మహిళా కమిషన్‌కు వచ్చేదాకా పట్టుబట్టారు కదా.. ఇప్పుడు పొన్నం ప్రభాకర్‌కు నోటీసులు ఇవ్వరా? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.