RS Praveen Kumar | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరింపు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. నవీన్ యాదవ్ గల్లీ కూడా దాటనియ్యను అంటున్నాడు.. జూబ్లీహిల్స్ నీ అయ్యా జాగీరా? అని నవీన్ యాదవ్‌ను ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నేను తలచుకుంటే జూబ్లీహిల్స్ దాటనియ్యను అంటున్నాడు నవీన్ యాదవ్. నేను ఓపెన్‌గా అడుగుతున్నా.. జూబ్లీహిల్స్ నీ అయ్యా జాగీరా..? పోలీసులు ఎక్కడ పోయారు. సుమోటో కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు. నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. పోలీసులు నవీన్ యాదవ్‌కు సపోర్టు చేస్తున్నారు అని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు, అసెంబ్లీకి పోకముందే ఇంత రౌడీయిజం చేస్తున్నారు. వీళ్ల పహిల్వాన్లు బస్తీల్లోకి వచ్చి అరాచకం చేస్తారు. ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టండి.. గుండాయిజం పెరుగుతుందని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. కేసీఆర్ అధికారంలో నుంచి పోయినప్పటి నుంచి బస్తీల్లో గుండాయిజం పెరిగిందని ఆమె చెప్పారు. మరి ముఖ్యంగా మహిళలు అభద్రతాభావంతో ఉన్నారు. గుండాగిరి, దౌర్జన్యం పోవాలంటే కారు గుర్తుకు ఓటేయాలి అని ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు.
మాజీ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఓ వ్యక్తికి ఫోన్ చేసి మీ ఇంట్లో గంజాయి పెట్టి ఉల్టా కేసులు నమోదు చేయిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇలా ధమ్కీలు ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్. వీళ్లందరు రేపు మన ఇండ్లలో తిండి కాదు పెట్టేది గంజాయి. కేసీఆర్ అందరికి తిండి పెడితే.. వీళ్లు అందరి ఇంట్లో గంజాయి పెట్టి కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలంతా నవంబర్ 11వ తేదీన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు వేచి చూస్తున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.