RS Praveen Kumar | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. చెల్లని రూపాయిగా చేవెళ్ల డిక్లరేషన్ మిగిలిపోయిందని తీవ్రంగా విమర్శించారు. మల్లిఖార్జున ఖర్గే గారూ, మీ 2023 చేవెళ్ల డిక్లరేషన్ గుర్తుందా? కేవలం చెల్లని రూపాయిగా మిగిలిపోయిన ఈ మాయదారి డిక్లరేషన్ గురించి ఈ రోజు ఎల్బీ స్టేడియంలో మీరు మాట్లాడతారని ఆశిస్తున్నాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
నాడు కాంగ్రెస్ అందరికీ ఆమోదయోగ్యంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారు. కానీ నేడు రిజర్వేషన్లు పెంచామని చెప్పి, మాదిగ ఉపకులాలను, మాల ఉపకులాలను నిలువునా మోసం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాల్లో వర్గీకరణ అమలు చేయకుండా అన్ని ఉపకులాలకు అన్యాయం చేసిన పార్టీ మీ కాంగ్రెస్. కావాలంటే రేవంత్ రెడ్డిని అడగండి అని ఖర్గేకు ఆర్ఎస్పీ సూచించారు.
కేసీఆర్ 10 లక్షలు ఇచ్చే దళిత బంధు కన్నా బాగా 2 లక్షలు పెంచి, రూ. 12 లక్షలతో అంబేడ్కర్ అభయ హస్తం పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అధికారంలోకి వచ్చాక రెండు సార్లు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది మీ కాంగ్రెస్ పార్టీ. ఈ పథకం కింద నేటికీ ఒక్క లబ్దిదారుడిని కూడా ఎంపిక చేయలేకపోయారు, ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్, అన్ని కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నాడు హామీ ఇచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ కంపెనీల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని మీరు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క కాంట్రాక్టు అయినా ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారా? కనీసం కొడంగల్-నారాయణపేట పథకంలో కూడా ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్ల జాడ లేదు! ఈ వివరాలు కూడా మీరు ఈ రోజు వెల్లడించాలి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం, ఐదేండ్లలో అర్హులైన వారందరికీ ఇస్తామన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎంత మంది ఎస్సీ, ఎస్టీలకు ఇంటి స్థలం ఇప్పించారు? ఎన్ని ఎకరాల స్థలం ఇప్పటి వరకు పంచారు? తెలంగాణ లో ఎస్సీ ఎస్టీల భూములు తిరిగి అసైనీలకు అన్ని హక్కులతో పునరుద్దరిస్తామన్నారు. ఇంతవరకు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు? ఈ మోసం చాలదన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్లలో పేదల భూములు ఎందుకు లాక్కున్నది? అడవిని నమ్ముకుని పోడు చేసుకుని బతికే ఆదివాసుల భూములు ఎందుకు లాక్కుంటుంది? కాంగ్రెస్ పార్టీ అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, అర్హులైన వారందరికీ పోడు పట్టాలు ఇస్తామంది.
ఇప్పటి వరకు ఒక్క గుంట పోడు భూమికి అయినా పట్టా ఇచ్చారా? ఒక్క ఆదివాసి కుటుంబానికైనా పట్టా పాస్ బుక్ ఇచ్చారా? ఇవ్వలేదు. టైగర్ కారిడార్ పేరుతో అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 49 తీసుకొచ్చి ఉల్లంఘించడం లేదా? ప్రతి గూడెం, తండా పంచాయతీలకు ఏటా 25 లక్షలు కేటాయిస్తామన్నారు. ఎన్ని గూడాలకు, తండాలకు రెండేళ్ల కాలంలో 25 లక్షలు అందించారు? అసలు గ్రామ పంచాయితీ ఎన్నికలు కూడా జరపకుండా తండాలు,గూడాలను అభివృద్ధికి దూరంగా నెట్టేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? దీని మీద వివరణ ఇవ్వండి అని ఆర్ఎస్పీ అడిగారు.
మాల, మాదిగ, ఇతర ఉపకులాలకు మొత్తం 3 కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాదికి ఒక్కో కార్పోరేషన్‌కు 750 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు. రెండేళ్లలో 3 కార్పోరేషన్లకు కలిపి రూ. 4500 కోట్లు రావాలి. ఏవి? ఎందుకు ఇవ్వలేదు? కార్పోరేషన్ల ఏర్పాటు ఎందుకు చేయలేదు? తుకారాం ఆదివాసీ కార్పోరేషన్, సేవాలాల్ లంబాడా, ఎరుకల కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఒక్కో కార్పోరేషన్‌కు ఏటా 500 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం. రెండేళ్లలో 3000 కోట్లు మంజూరు చేయాలి. చేశారా? కనీసం కార్పోరేషన్లు ఏర్పాటు చేశారా? ఎస్టీల అభివృద్ధి పట్ల మీ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందా? అని ఆర్ఎస్పీ నిలదీశారు.
నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్‌లో 5 కొత్తగా ఐటిడిఎలు ఏర్పాటు చేసి, మొత్తం 9 ఐటిడిఏల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తామన్నారు. ఏమీ చేయలేక పోయారు? విద్యా జ్యోతి పథకం కింద
ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10 పాసైతే 10 వేలు, ఇంటర్ పాసైతే 15 వేలు, డిగ్రీ పాసైతే 25 వేలు, పీజీ పాసైతే లక్ష రూపాయలు
ఎంఫిల్, పిహెచ్డీ పూర్తి చేస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. కనీసం 10 రూపాయలు అయినా ఇవ్వలేక పోయారు ? ఎందుకని?? అని ప్రశ్నించారు.
ప్రతి మండలంలో గురుకులం ఉండేలా, ఎస్సీ ఎస్టీ గురుకులం ఏర్పాటు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు డిగ్రీ, పిజి చదివే ఎస్సీ ఎస్టీలందరికీ హాస్టల్ సదుపాయం. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఇందులో ఒక్క పైసా ప్రగతి లేదు, ఎందుకని? ఎస్సీ ఎస్టీలకు మాయమాటలు చెప్పి నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ. మోసపు హామీలు, బూటకపు మాటలకు ప్రత్యక్ష సాక్ష్యం మీరే మల్లికార్జున ఖర్గే గారు. ఎస్సీ ఎస్టీలను ఇంత ఘోరంగా దగా చేసి ఇంకా ఏ ముఖం పెట్టుకుని మా తెలంగాణకు వచ్చారు? రేవంత్ రెడ్డితో కుమ్మక్కై మళ్లీ కొత్తగా ఏ మోసం చేయబోతున్నారు? అని మల్లికార్జున్ ఖర్గేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.