హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): నాడు కేసీఆర్ హయాంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించిన గురుకులాలను నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ధ్వంసం చేయాలని కుట్రలు పన్నుతున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నియంత పోకడలతో దళిత బిడ్డలే సమిధలు అవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజుతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ గురుకులాల్లోని 2,000 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఇతర సిబ్బందిని రాత్రికి రాత్రే ఒక్క జీవోతో ఉద్యోగాల నుంచి తొలగించారని మండిపడ్డారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవానికి ఒక్కరోజు ముందే టీచర్ల జీవితాల్లో సీఎం రేవంత్‌రెడ్డి మట్టిగొట్టి, వారి కుటుంబాలను రోడ్డు పాల్జేశారని విమర్శించారు. నిబంధనలకు లోబడి నియామకాలు జరిగిన వారిని ఎలా తొలగిస్తారని నిలదీశారు. తక్షణమే తొలగించిన ఆ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో గతంలో ఇంజినీర్లు, డాక్ట ర్లు, నేవీ ఆఫీసర్లు అయితే.. ఇపుడు మళ్లీ పశువులు కాసే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. వెయ్యి మంది డాక్టర్లను తయారుచేసిన గౌలిదొడ్డి గురుకులంలో ఇప్పుడు ఉపాధ్యాయులు సమ్మె చేసే పరిస్థితిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తిరుపతికి ఆర్థికసాయం చేస్తారా.. లేదా?
అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు తిరుపతికి రూ.2 లక్షల సాయం అందించని ప్రభుత్వం ఎందుకని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నిలదీశారు. తిరుపతికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయకపోతే తానే సాయం చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతుల పిల్లలు చదువుకోవద్దా? అని ప్రశ్నించారు. అన్ని వర్గాలవారు మేలొని రేవంత్‌రెడ్డి ప్రభుత్వ కుట్రల నుంచి గురుకులాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గుర్తులను చెరపాలనే కుట్రలో భాగంగానే గురుకులాల ధ్వంసరచన చేస్తున్నారని, ఏనాటికీ ఆయన గుర్తులను చెరపలేరని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన గురుకులాలను దెబ్బతీస్తే 10 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అంధకారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి రక్తంలోనే దేశ్‌ముఖ్, రాజరికం, నియంతృత్వ ఆలోచనలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు వరంగా మారిన గురుకులాల నిర్వీర్యానికి రేవంత్‌రెడ్డి సర్కారు కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గురుకులాల పరిరక్షణ బీఆర్ఎస్ తరఫున ఉద్యమిస్తామని తెలిపారు.