RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనంతా అయోమయంగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో సిర్పూర్ కాగజ్నగర్ నియోజవకర్గంలో గందరగోళం నెలకొంది అని ఆయన ధ్వజమెత్తారు. ఇందుకు సిర్పూర్ తాలుకా సార్సాల గ్రామంలోని పరిస్థితే నిదర్శనమని ఆర్ఎస్పీ చెప్పుకొచ్చారు.
సిర్పూర్ తాలూకా సార్సాలలో జుమిడి మీనా, రత్నం సౌజన్య, గుబుడే అనూష, గుబడే శేఖర్ అనే నలుగురు వ్యక్తులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. వీల్లు ఇల్లు కట్టుకోడానికి ముగ్గు పోద్దామని వెళ్తే, అటవీ అధికారులు వచ్చి అడ్డుకుంటున్నారు. ఇది అటవీ భూమి ఇల్లు కట్టుకోడానికి అవకాశం లేదంటున్నారు. ఈ వ్యక్తులేమో గత 50 ఏళ్ల నుండి ఇక్కడే నివసిస్తున్నారు.. ఇల్లు పన్ను, కరెంట్ బిల్లు కడుతున్నారు. ఉన్న ఇంటి స్థలంలోనే కొత్తగా ముగ్గు పోద్దామంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ కమిటీలు వేసి వీల్లను లబ్దిదారులుగా గుర్తించి ఇండ్లు ఇస్తారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖనేమో లేదు లేదు అది అటవీ ప్రాంతం అక్కడ ఇల్లు కట్టద్దు అంటరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేమో ఆయన ఫోటోతో సహా ఇల్లు కట్టుకోండి అని లెటర్లు పంపిస్తరు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్కనేమో ప్రజల నుండి ఇంటి పన్ను వసూలు చేస్తరు అని ఆర్ఎస్పీ గుర్తు చేశారు.
మరి ఇపుడు ఆ కుటుంబాలు ఏం చేయాలి.? ఉన్న ఇండ్లు ఖాళీ చేసి కొత్త ఇండ్లకు ముగ్గు పోద్దామంటే ఉన్న ఇల్లు పోయింది. ఇపుడు ఎటు పోవాలి,ఎక్కడ నివసించాలి? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? జిల్లా కలెక్టర్ నీ చేతుల్లో ఏం లేదు అంటరు , జిల్లా అటవీ అధికారి ఇది మా చట్టం అంటరు. మరి పేద ప్రజలకు హక్కులు చట్టాలు లేవా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని మోసం చేయాలని చూస్తుంది.? రేవంత్ రెడ్డి గారు ఇదేనా ప్రజాపాలన? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.