మొయినాబాద్, నవంబర్ 6: తెలంగాణలో గురుకుల విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. దేశంలోనే తెలంగాణలో గురుకుల తొలి కోడింగ్ అకాడమీని ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధి పెద్దమంగళారంలోని ఆజాద్ ఇంజినీరింగ్ కళాశాల భవనంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల కోడింగ్ పాఠశాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డితో కలిసి సందర్శించారు.
కోడింగ్ పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రెండు నెలల నుంచి బోధించడానికి ఉపాధ్యాయులు లేరని, 10వ తరగతి విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని, 5వ తరగతిలో ప్రవేశాలు తీసుకోకుండా నిలిపివేశారని విద్యార్థులు వివరించారు. గతంలో కోడింగ్ ఎడ్యుకేషన్ అందించిన ఉపాధ్యాయులే తిరిగి తమకు కావాలని కోరారు. ఈ ఏడాది బూట్లు కూడా ఇవ్వలేదని, కొన్ని సందర్భాల్లో టిఫిన్ కూడా 10 గంటలకు పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌టాప్‌లు తప్ప కొత్త ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. కోడింగ్ పాఠశాలలో సమస్యలను తెలుసుకుని రావాలని కేసీఆర్ ఆదేశించడంతో ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. దేశంలోనే తొలి వెల్ఫేర్ కోడింగ్ అకాడమీని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కోడింగ్ అకాడమీలో సీట్లు ఇచ్చిందని చెప్పారు. కోడింగ్ అకాడమీతో పాటు మ్యూజిక్ స్కూల్స్, స్పోర్ట్స్ అకాడమీ, లా కళాశాల, పీజీ కోర్సులను కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. ఈ కోడింగ్ అకాడమీని మూసివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, నాలుగు నెలల నుంచి ఉపాధ్యాయులు లేకపోవడమే అందుకు బలం చేకూరుస్తున్నదని వివరించారు.
గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి సీఎం రేవంత్‌రెడ్డికి కోడింగ్ అకాడమీ గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. కోడింగ్ అకాడమీ మూతపడే అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తగా.. కోడింగ్ అకాడమీలో 218 మంది ఉంటే.. 540 మంది ఉన్నారని అధికారులు తప్పుడు లెక్కలు చెప్తున్నారని విమర్శించారు. కోడింగ్ అకాడమీలో విద్యార్థులకు కొత్త ల్యాప్‌టాప్‌లు, కనీసం బూట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని ఆరోపణలు చేసేకంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఏనాడైనా డిప్యూటీ సీఎం, మంత్రులు సందర్శించారా? అని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ శాఖ రేవంత్‌రెడ్డి వద్దనే ఉందని, అయినా ఆ శాఖను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయన్నప్పుడు.. సుప్రీంకోర్డు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. విద్యార్థులు అధైర్యపడకుండా చదువుకోవాలని ప్రవీణ్‌కుమార్ సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అవినాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గ సీనియర్ నాయకులు దేశమోళ్ల ఆంజనేయులు తదితరులు ఉన్నారు.