ఖమ్మం, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/టేకులపల్లి/మణుగూరు టౌన్/ఖమ్మం: సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వైరాలో జరిగే సభలో ప్రజలకు వాస్తవాలను వివరించాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ఉద్యమసారథి కేసీఆర్ మానసపుత్రిక అని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఆయనే స్వయంగా రూపకల్పన చేసి నిర్మించిన ఎత్తిపోతల పథకం సీతారామ అని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీలేదని స్పష్టంచేశారు. కానీ కేసీఆర్ నిర్మించిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినట్టుగా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
‘సీతారామ నీళ్లొచ్చే వరకు ఉద్యమిస్తాం
ప్రాజెక్టుకు డిజైన్ చేసిందెవరు? కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన నిధులెన్ని? కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన నిధులెన్ని? ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర ఎంత? సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్న మూడు మోటర్లు బిగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమా? కాంగ్రెస్ ప్రభుత్వమా?’ వంటి అనేక విషయాలను ఉమ్మడి జిల్లా ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పూర్తి స్థాయిలో మాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 40 శాతం మందికి కూడా రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషయ్య, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, బెల్లం వేణు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరందాలి
ఇల్లెందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు నీరు వచ్చేవరకు ఉద్యమిస్తామని స్థానిక మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లెందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు నీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్‌గౌడ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరిప్రియానాయక్, బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్‌లు మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లా మీదుగా గోదావరి నది ప్రవహిస్తుండటంతో ఆ నీటిని జిల్లాలోని ప్రతీ ఎకరాకు పారించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిర్మించారని తెలిపారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు తమ స్వార్థం కోసం సీతారామ నీటిని భద్రాద్రి జిల్లాకు కాకుండా.. ఖమ్మం జిల్లాకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి నీటిని పక్క జిల్లాకు తరలిస్తే ఊరుకునేది లేదని, రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోడ బాలు, తాతా గణేశ్, బానోత్ రామ, కిషన్, జాలాది అప్పారావు, లాలు, కిరణ్, శివకృష్ణ, రవి, లచ్చు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు సీఎం పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పలు పంప్‌హౌజ్‌లను ప్రారంభించి వైరాలో ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నారు. వైరా వేదికగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ మూడోవిడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రికి నీళ్లివ్వని సీఎంకు పూసుగూడెంలోనే బుద్ధిచెప్తాం
పినపాక నియోజకవర్గం, భద్రాద్రి జిల్లా రైతులకు సీతారామ నీళ్లివ్వకుండా అన్యాయం చేస్తున్న పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పూసుగూడెంలోనే బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హెచ్చరించారు. భద్రాద్రి జిల్లాలోని పినపాక నియోజకవర్గానికి చెందిన సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఇక్కడి రైతులకు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు వారి నియోజకవర్గాలకు తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ భద్రాద్రి జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బుధవారం ఆయన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తొలుత పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.8 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. ఈ ప్రాజెక్టు నీళ్లను ఖమ్మం జిల్లా మంత్రులు తమ నియోజకవర్గాలకు తీసుకెళ్లాలని చూడటం సిగ్గుచేటని విమర్శించారు. సీతారామ ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం తొలుత స్థానిక రైతులకు, ముఖ్యంగా భద్రాద్రి జిల్లా రైతులకు నీళ్లు ఇవ్వాలని, ఆ తరువాతే ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోశం నర్సింహారావు, అడపా అప్పారావు, ముత్యం బాబు, వట్టం రాంబాబు పాల్గొన్నారు.