హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రాష్ట్రంలోని బీజేపీని కాంగ్రెస్‌కు బీ టీమ్‌గా మార్చేశారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు, బండి సంజయ్‌కు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉందని, కేసీఆర్‌కు ఆయనకు పోలికా అని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంజయ్ ‘డార్క్ సీక్రెట్స్’ గురించి కరీంనగర్లో ఏ బీజేపీ కార్యకర్తను అడిగినా చెప్తారని తెలిపారు. ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడం కాదని, వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ సీట్లలో కనీసం సగం గెలిచి చూపించాలని సవాలు విసిరారు. బీఆర్ఎస్ నిండు కుండని, ఎప్పటికీ ఖాళీ కాదని తెగేసి చెప్పారు.
రాష్ట్రంలో బీజేపీని బండి సంజయ్ భ్రష్టు పట్టించారని, అందుకే ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారని రావుల ఆరోపించారు. సంచనాల కోసం, సోషల్ మీడియాలో వచ్చే లైక్‌ల కోసం ఆయన చిల్లర వాగుడు వాగుతున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని మండిపడ్డారు. ఇలాంటి వారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. వావి, వరసలు అనే మాటలు ఎప్పుడు మాట్లాడాలో కూడా తెలియని అజ్ఞాని సంజయ్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వారి వల్ల కేంద్ర మంత్రివర్గంపై నమ్మకం పోతున్నదని పేర్కొన్నారు. ఏం ఘనకార్యం చేశావని ఫోన్ ట్యాపింగ్ విచారణకు ఊరేగింపుగా వెళ్లావని మండిపడ్డారు. రాష్ట్రానికి కనీసం రూ.1000 కోట్ల ప్రాజెక్టునైనా తెచ్చావా? పార్లమెంట్లో తెలంగాణ అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడావా? అని నిలదీశారు.