హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తేతెలంగాణ): మాజీ మంత్రి కేటీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకే కాంగ్రెస్ ఫార్ములావన్ ఈ-రేస్‌లో అవినీతి అంటూ రాద్ధాంతం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఫార్ములా ఈ-రేస్ కంపెనీకి చెల్లించిన డబ్బు కేటీఆర్ జేబులోకి ఎలా వెళ్తది? ఇందులో అవినీతికి ఆస్కారమెక్కడిది?’ అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు తెచ్చిన ఈ రేస్‌లో అక్రమాలు జరిగాయ ని, బాంబులు పేలుతాయని మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా గ్యారెంటీల అమలుపై దృష్టిపెట్టడంలేదని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి విజన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, గత ప్రభుత్వంపై ఆరోపణలతో పబ్బంగడపడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇమేజ్ను ప్రపంచస్థాయికి పెంచిన కేసీఆర్, కేటీఆర్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు, కుతంత్రాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అంతర్జాతీయస్థాయి క్రీడలతో రాష్ట్ర ఖ్యాతి ఇనుమడిస్తుందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఇక్కడ జరిగిన ఈ రేస్‌ను వందలాది దేశాల ప్రజలు తిలకించారని గుర్తుచేశారు. ‘ఆయన గురువు చంద్రబాబు ఏమీలేని అమరావతిలో కపిల్‌దేవ్‌ను తెచ్చి గోల్ఫ్ కోర్ట్స్ నిర్మిస్తామని చెప్తుంటే, ఇక్కడ శిశ్యుడేమో హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుతంత్రాలు చేస్తున్నారు’ అంటూ విమర్శించారు. ఎఫ్ఐఏకు మంత్రివర్గ ఆమోదంలేకుండానే నిధులిచ్చారని ఆరోపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్‌లో రూ.20 కోట్లతో నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు క్యాబినెట్ ఆమోదాన్ని ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. మొదలు కానీ మూసీ ప్రాజెక్ట్ వెంట పెద్దపెద్ద బిల్డింగ్లు, అందమైన హోటళ్లు నిర్మిస్తామని చెప్తున్న ఆయనకు, ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో హైదరాబాద్‌ను ఆగ్రస్థానంలో నిలబెడితే తప్పులా కనబడడం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్పై ఏడుపుమాని పాలనపై దృష్టిపెట్టాలని హితవుపలికారు.