హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): పోలీస్ నియామకాల కోసం తీసుకొచ్చిన జీవో 46ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమారిని కలిసి జీవో రద్దుతోపాటు ఆశావర్కర్లు, అంగన్వాడీలు, గురుకుల టీచర్ల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో సెక్రటేరియట్ గోడకు వినతిపత్రాన్ని అతికించారు.
అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆయా ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి 10 రోజుల నుం చి అడుగుతున్నా సీఎస్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని రాకేశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నా ప్రజాపాలన? అని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జీవో 46 బాధితులకు న్యా యం చేస్తామని కాంగ్రెస్ మాటిచ్చిందని, ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి ఈ అంశంపై ము ఖం చాటేశారని విమర్శించారు. జీవో రద్దు కోసం నిరుద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేద ని ధ్వజమెత్తారు. జీవో వెనక్కి తీసుకోవాలని లేకుంటే సవరించాలని డిమాండ్ చేశారు.