కలెక్టరేట్, డిసెంబర్ 29: ఆర్థికంగా వెనుకబడిన వారంటూ, అగ్రకులాలకు రిజర్వేష న్లు కల్పించి ప్రధాని మోదీ దేశంలోని బీసీల గొంతు కోశారని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షు డు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత రాజారామ్ యాదవ్ ఆరోపించారు. సమాజంలో సింహభాగం ఉన్న వెనుకబడిన తరగతుల స్థితిగతులను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకునేందుకు బీసీలంతా మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లోని కృషి భవన్లో బీసీ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. కుల, మతాల పేరుతో రిజర్వేషన్లు కల్పిస్తున్న పాలకులు, సమాజంలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్వాతంత్య్రానికి ముందు నుంచే బీసీలు అగ్రకుల రాజకీయ నేతల ఆగ్రహానికి బలవుతున్నారని దుయ్యబట్టారు. దేశ సంప ద సృష్టిలో వృత్తి కులాల పాత్ర ఇతోధికమని తెలిసినా, ఆ కులాలను అణచివేస్తున్న ఘనత కాంగ్రెస్, బీజేపీకే దక్కుతుందని ఆరోపించారు. కమ్యూనిస్టులను కూడా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ జీవో 29ని తెచ్చి బీసీల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ ఆధిపత్య కులనాయకుల జెండాలు మోసిన బీసీలు ప్రస్తుతం ప్రశ్నించే స్థాయికి ఎదగటం హర్షించదగ్గ పరిణామమన్నారు.