హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూల్ జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి హత్యపై ప్రత్యేక దర్యాపు బృందం (సిట్) ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. హత్య జరిగి నాలుగు రోజులైనా ఇంతవరకు నిందితులను కనీసం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ చేయలేదని, తమకు స్థానిక పోలీస్ అధికారులపై నమ్మకం పోయిందని స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం శ్రీధర్‌రెడ్డి తండ్రి శేఖర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రవీణ్‌కుమార్.. డీజీపీ రవిగుప్తాకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పడావు పడిన తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు రక్తపుటేరులు పారిస్తూ మనుషులను చంపుతున్నారని విమర్శించారు. హత్యకు గురైన శ్రీధర్‌రెడ్డి ఎంతో అమాయకుడు, మృధుస్వభావి అని, అలాంటి వ్యక్తిని నిద్రపోతుంటే అత్యంత దారుణంగా గొడ్డళ్లతో నరికి హత్యచేశారని అన్నారు.
ఈ హత్యకు మంత్రి జూపల్లి అనుచరులే కారణమని శ్రీధర్‌రెడ్డి తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేస్తే, స్థానిక ఎస్ఐ బలవంతంగా జూపల్లి పేరును ఫిర్యాదునుంచి తొలగింపజేశారని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదై నాలుగు రోజులైనా ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, రెండో ప్రధాన నిందితుడు మహేశ్ సహా ఇతర నిందితులలో ఒక్కరిని కూడా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. కృష్ణప్రసాద్ చిన్నంబావి మండలంలోని జూపల్లి నివాసంలో దర్జాగా విలేకరుల సమావేశం కూడా నిర్వహించారని, పోలీసు వ్యవస్థ ఏమి చేస్తున్నదని ప్రశ్నించారు. జూపల్లి సీనియర్ మంత్రి అయి ఉండి కూడా విచక్షణ పాటించకుండా చనిపోయిన శ్రీధర్‌రెడ్డిపై ఘోరమైన అభాండాలు వేస్తున్నాడని విమర్శించారు. హత్య అనంతరం గ్రామస్థులంతా కలిసి నిందితుల ఇండ్లను కూలగొడతామన్నా.. కొడుకు పోయిన దుఃఖంలో ఉన్న శేఖర్‌రెడ్డి విచక్షణతో వ్యవహరించి వారిని వారించారని, తన కుటుంబానికి న్యాయం జరగాలని మాత్రమే కోరుకున్నారని చెప్పారు.
హత్య గురించి ఎస్ఐకి ముందే సమాచారం
హత్య గురించి చిన్నంబావి ఎస్ఐకి ముందే తెలుసని స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారని, అయినా శ్రీధర్‌రెడ్డిని కాపాడుకోలేకపోయారని ప్రవీణ్‌కుమార్ వాపోయారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్నవారిని కూడా పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. హోంశాఖ సీఎం వద్దే ఉన్నప్పటికీ చట్టబద్ధంగా నడుచుకునే వ్యక్తికి రక్షణ కల్పించలేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే డీజీపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటుచేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ మంత్రి, ఆయన అనుచరులతో కుమ్మక్కైన స్థానిక పోలీసు అధికారులను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని, కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతాలను ఫ్యాక్షన్ జోన్లుగా, సమస్యాత్మక ప్రాంతాలుగా ప్రకటించి పోలీసు పికెట్లు ఏర్పాటు చేయాలని, జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వారంరోజుల్లో న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, అభిలాష్‌రావు, ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రామమ్మ తదితరులు డీజీపీని కలిసినవారిలో ఉన్నారు.