బీఆర్ఎస్ఫై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ ఇచ్చినకమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడంలేదని నిలదీశారు. రిపోర్ట్ బయటకు ఇవ్వకముందే రేవంత్ రెడ్డి అనుకూల మీడియా విష ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక స్కాములు జరుగుతున్నాయని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. కోర్టు సమాధానం చెప్పమంటే కాంగ్రెస్ నాయకులు తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులకు చట్టం తెలువదా- లేక తెలిసి వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని కుటిల యత్నమా అని ప్రశ్నించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం ప్రకారం, ఒక న్యాయమూర్తి (జడ్జి)ను విచారణ కమిషన్కు నియమించినా, ఆ కమిషన్ న్యాయవ్యవస్థ (judiciary)లో భాగం కాదని.. అంటే, ఆ కమిషన్ కోర్టుల్లా న్యాయ తీర్పులు ఇవ్వలేరు, మరియు కోర్ట్లు కలిగిన అధికారాలు వారికి ఉండవని స్పష్టం చేశారు.
కమిషన్ నివేదిక ఇవ్వడం మాత్రమే చేస్తుంది. కనుక, జడ్జి ఉన్నా సరే, అది న్యాయవ్యవస్థలో భాగంగా పరిగణించబడదని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ చట్టాన్ని ఉద్దేశ పూర్వకంగా తప్పుడు వివరణ ఇవ్వడం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి మండలికి తగదని హితవుపలికారు. న్యాయవ్యవస్థను కేసీఆర్, హరీశ్ రావు గౌరవించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ చేయడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. కాళేశ్వరం 100 కంపొనెంట్ల పరిధి లో కేవలం 1 కంపొనెంట్ లో, 85 పిల్లర్లలో 2 పిల్లర్లు గురించి మాత్రమే అందులో ప్రస్తావిస్తూ పూర్తి కాళేశ్వరం కూలిపోయిందని అసత్యాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి పై ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.