Patolla Karthik Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతా పార్టీతో కాంప్రమైజ్ అయితే ఎమ్మెల్సీ కవిత ఎందుకు జైల్లో ఉంటది..? అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో పటోళ్ల కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను తప్పించేందుకు బీజేపీతో లాలూచిపడ్డారు. ఈ కేసు నుంచి బిడ్డను తప్పించడానికి పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ బీజేపీతో కాంప్రమైజ్ అయిండు అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. కవిత జైల్లో ఉండి 120 రోజులు దాటుతుంది. బీజేపీతో కాంప్రమైజ్ అయి ఉంటే కవిత జైల్లో ఎందుకు ఉంటది. పనికట్టుకుని కేసీఆర్పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీల వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని కార్తీక్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే కవచం బీఆర్ఎస్ పార్టీ. బీజేపీతో పని చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. టీడీపీని వాడుకుంటూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారు. తెలంగాణ ప్రజలను వంచిచొద్దు. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉంది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఈ రెండు జాతీయ పార్టీలకు భవిష్యత్లో తప్పకుండా రాజకీయ శిక్ష పడుతుందన్నారు కార్తీక్ రెడ్డి.
రాజకీయాల్లో చాలా విచిత్రాలు చూస్తాం. అన్నింటి కంటే పెద్ద విచిత్రం రాష్ట్రంలో జరుగుతుంది. అదేంటంటే సిద్ధాంతపరంగా వైరుధ్యాలు కలిగిన రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో ఎలా పొత్తులో ఉన్నాయనేది. తెలంగాణలో బీజేపీ – కాంగ్రెస్ పొత్తు నడుస్తోంది. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారు. బీజేపీ పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడి నిన్నటికి నెల అవుతుంది.ఈ నెల రోజుల్లోనే రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కాయి. ఫలితాలు వచ్చిన వారం పది రోజుల్లోనే కేబినెట్ మినిస్టర్ అయిండు కిషన్ రెడ్డి. మంచి చేయకుండా తెలంగాణ ఆస్తి అయిన సింగరేణి బొగ్గు గనులను వేలం వేశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల పట్ల అనుకూలత ఉంటే బొగ్గు గనుల వేలాన్ని ఆపేది ఉండే. కేసీఆర్ ఆపినట్లే కాంగ్రెస్కు శక్తి ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేకపోయిందని పటోళ్ల కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు.