హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కి దమ్ముంటే లగచర్ల ఘటనపై సీబీఐ ఎంక్వయిరీ వేయించి నిజాలు నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ చెప్పుచేతల్లో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. సిద్ధాంతపరంగా వైరుధ్యం కలిగిన బీజేపీ, కాంగ్రెస్.. తెలంగాణలో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకోవడానికి చాలా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. వీటికి బీఆర్ఎస్, కేటీఆర్ టార్గెట్‌గా మారారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ కొట్టుకోవడం కాదు.. బీఆర్ఎస్ను బొందపెట్టాలని గతంలో సంజయ్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇందుకు సంబంధించిన ఆడియోను మీడియాకు వినిపించారు. బీఆర్ఎస్ ఉంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని కేసీఆర్‌ను టార్గెట్ చేశారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, చిరుమిళ్ల రాకేశ్, మనోహర్‌రెడ్డి, చటారి దశరథ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డితో కలిసి బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లో ఎంపీగా బండి సంజయ్ గెలవడానికి, బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు రాష్ట్రం నుంచి గెలవడానికి రేవంత్‌రెడ్డి కారణమని బయట ఎవరిని అడిగినా చెప్తారని పేర్కొన్నారు.
అమిత్‌షాపై కేసు ఎందుకు విత్‌డ్రా చేశారు
రాష్ట్రంలో అమిత్‌షాపై నమోదైన కేసులను ఎందుకు విత్‌డ్రా చేశారని కార్తిక్‌రెడ్డి నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి మోదీని, అమిత్‌షాను కలిసి వచ్చిన తర్వాత విత్‌డ్రా చేసుకున్నారని ఆరోపించారు. దేశంలో బహుశా ఇలాంటి ఘటన ఇదే మొదటిసారని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఈడీ రెండు రోజులపాటు దాడులు చేసినా ఇప్పటి వరకు కనీస సమాచారం రావడం లేదని విమర్శించారు. ఏ కేసులోనైనా ప్రాథమిక సమాచారం (ఎఫ్ఐఆర్) నమోదు చేసినట్టుగా, ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్డు (ఈసీఐఆర్) రాస్తుందని, దానిని ఇప్పటివరకు ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. అదానీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేస్తుంటే రాష్ట్రంలో ఆయనకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలు దేశ చరిత్రలో తొలిసారి సంప్రదాయాలకు భిన్నంగా జరిగాయని అన్నారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలనే పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నట్టుగా ఉన్నదని ఆరోపించారు.