హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో మాట్లాడిన భాష దుర్మార్గమని, ఆయన ఏమాత్రం
విజ్ఞత లేకుండా మాట్లాడారని బీఆర్ఎస్ నాయకుడు పల్లె రవికుమార్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఇద్దరు బీసీ బిడ్డలు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్లు అయ్యారని,
ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా బీసీలకు అవకాశం ఇచ్చారని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి.. బుర్రా వెంకటేశం చీఫ్ సెక్రెటరీ కాకుండా కుట్ర చేశారని రవికుమార్ విమర్శించారు. తెలంగాణ గురించి అణువణువు కేసీఆర్‌కు తెలుసని అన్నారు. రేవంత్ రెడ్డి భాష మానవులు మాట్లాడే భాష కాదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెంటనే కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎంను రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని బీసీ కమిషన్ మజీ సభ్యుడు, బీఆర్ఎస్ నేత ఉపేంద్రచారి అన్నారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశ చరిత్రలో కేసీఆర్ 11 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేశారని, కానీ రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా తుపాకీ పట్టిన మానవమృగమని వ్యాఖ్యానించారు. 1969లో 400 మంది విద్యార్థులను కాల్చిచంపిన కాంగ్రెస్ మానవమృగమని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1200 మంది చావుకు కారణమైన కాంగ్రెస్ మానవ మృగమని అన్నారు.