హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో మైనార్టీలకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ నేత ముఖీద్చాందా ఆందోళన వ్యక్తంచేశారు. కొడంగల్‌లో దర్గాలు, ముస్లింల శ్మశానవాటికలు కూల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సెక్యులరిజాన్ని మంటగలుపుతున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో 50చోట్ల మతకలహాలు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ కూల్చివేత డిక్లరేషన్‌గా మారిందని ఎద్దేవా చేశారు. మొయినాబాద్‌లో మసీదు కూల్చినవారిపై, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో మదర్సాలపై దాడులు చేసినవారిపై చర్యలు లేవని మండిపడ్డారు.
కొడంగల్‌లో కూల్చివేతలపై సీఎం రేవంత్‌రెడ్డి మైనార్టీలకు క్షమాపణ చెప్పి కూల్చిన కట్టడాలను వెంటనే పునర్నించాలని, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ సలీం మాట్లాడుతూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ముస్లింల పవిత్రస్థలాలపై అధికార యంత్రాంగం దాడి చేసి వక్ఫ్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో కొత్త దేవాలయాలు, మసీదులు కడితే రేవంత్‌రెడ్డి పాలనలో కూలుస్తున్నారని మండిపడ్డారు.