హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కమిషన్ చైర్మన్‌ను మార్చాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుబడుతున్నారా? అంటూ జస్టిస్ నర్సింహారెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. సుప్రీం తీర్పు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా వచ్చినదిగానే అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్తు కమిషన్‌కు కేసీఆర్ రాసిన లేఖలో జస్టిస్ నర్సింహారెడ్డి వ్యక్తిగత విషయాలను ఎక్కడా ప్రస్తావించలేదని, తీసుకున్న నిర్ణయాలను మాత్రమే తప్పుబట్టారని పేర్కొన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు నర్సింహారెడ్డిని బాధ్యతల నుంచి తప్పించిందని తెలిపారు. రాజీనామా తర్వాత నర్సింహారెడ్డి స్థాయి మరిచి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పైనా, ఎమ్మెల్సీ కవితపైనా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు.
కేసీఆర్ ఇంకా సమాధానం ఇవ్వలేదని అంటూనే కమిషన్ నివేదిక సిద్ధం అయిందని ఎలా చెప్తారని ప్రశ్నించారు. దీనినిబట్టి ఆయన దురుద్దేశాలు అర్థమవుతున్నాయని విమర్శించారు. విచారణ ఎదుర్కొంటున్న కవితను దోషి అన్నట్టు ఎలా మాట్లాడతారని నిలదీశారు. కోర్టు తీర్పును తప్పుబట్టి నర్సింహారెడ్డిపై ఆర్టికల్ 142 ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. నర్సింహారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని అప్పట్లో పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు ఉద్యమం కూడా చేశారని, మరిప్పుడు ఆయననే విచారణ కమిషన్ చైర్మన్‌గా ఎలా నియమించారని ప్రశ్నించారు.
నర్సింహారెడ్డిని విద్యుత్తు కమిషన్ చైర్మన్‌గా నియమించిన రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చుండూరు మారణహోమంపై హత్యచేసిన నేరస్థుల తరుఫున వ్యాఖ్యానించిన జస్టిస్ నర్సింహారెడ్డిపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడాలన్నారు. గతంలో నర్సిం హారెడ్డిపై సీబీఐ విచారణ చేపట్టాలని దళిత సంఘాలు ఆందోళన చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. నర్సింహారెడ్డిలో ఆరెస్సెస్ మూలా లున్న సంగతి అందరికీ తెలుసని అన్నారు.
ఒవైసీ వ్యాఖ్యల్లో అర్థంలేదు
కేశవ్ మెమోరియల్‌కు చైర్మన్‌గా ఉన్న నర్సింహారెడ్డిని కమిషన్ చైర్మన్‌గా నియమించడంపై అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు స్పందించడం లేదని క్రిశాంక్ ప్రశ్నించారు. బీజేపీతో సంప్రదింపుల కోసమే కేటీఆర్, హరీశ్ ఢిల్లీ వెళ్లారన్న తప్పుడు వార్తలపై ఒవైసీ వివరణ కోరడంలో అర్థం లేదని అన్నారు. సుప్రీం కేసుల విషయమై చర్చించేందుకే ఢిల్లీ వెళ్లారు తప్పితే అందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. ఒవైసీకి కేసీఆర్ జవాబుదారీ కాదని, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉత్త వదంతేని తేల్చి చెప్పారు.