హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : తన బామ్మర్ది కండ్లలో ఆనందం చూడటానికి సీఎం రేవంత్‌రెడ్డి కోట్ల విలువైన కాంట్రాక్టులను, ప్రజాధనాన్ని అప్పనంగా అప్పగిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. కేవలం రూ.7 లక్షల ఆర్థిక లావాదేవీలు ఉన్న రేవంత్‌రెడ్డి బామ్మర్దికి చెందిన శోధ కన్స్ట్రక్షన్స్కు రూ.1,617 కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగించారని తెలిపారు. ఆ సంస్థకు అమృత్ టెండర్లు, సింగరేణి మైనింగ్ కాంట్రాక్టు, డిండి ఇరిగేషన్ కాంట్రాక్టు ఇవ్వడంపై విచారణ చేపట్టాలని న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో శుక్రవారం క్రిశాంక్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఒక సంచలన కేసులో ఒత్తిడి పెడుతున్నారని పేర్కొంటూ తప్పుకున్న జడ్జి విషయంలో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న సంబంధంపై విచారణ జరపాలని కోరుతూ ఈడీకి ఫిర్యాదుచేసినట్టు తెలిపారు. ఎన్సీఎల్ఏటీలో కేసు ఉండగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేఎస్ఎస్ఆర్ కంపెనీకి రూ.678 కోట్ల విలువ గల 3 కాంట్రాక్టులు ఇవ్వడం చట్టవ్యతిరేకమని అన్నారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ పేరుపై రేవంత్ వాడినకారు ఉన్నదని తెలిపారు. ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, కుటుంబసభ్యులు, సన్నిహితులకు చెందిన కంపెనీలకు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టారని ఫిర్యాదులో పేరొన్నారు. ఈ చర్యల వెనుక మనీ లాండరింగ్, అధికార దుర్వినియోగానికి సంబంధించి బలమైన అనుమానాలు రేకెత్తిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బామ్మర్దికి చెందిన శోధ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి భారీగా కాంట్రాక్టులు ఇచ్చారని మన్నె క్రిశాంక్ ఆరోపించారు. మూడేండ్ల క్రితం ఈ సంస్థ మొత్తం ఆదాయం కేవలం రూ.7,13,113 మాత్రమే తెలిపారు. అయినప్పటికీ, ఆ సంస్థకు రూ.1,137 కోట్ల అమృత్ టెండర్ (2024లో), రూ.115 కోట్ల సింగరేణి మైనింగ్ కాంట్రాక్టు, రూ.365 కోట్ల డిండి ఎత్తిపోతల పథకం కాంట్రాక్టులు లభించాయని చెప్పారు. ఈ కంపెనీ నేపథ్యంతో పోలిస్తే ఈ కాంట్రాక్టుల విలువ విపరీతంగా పెరగడం, పక్షపాతం, ప్రభుత్వ డబ్బును అక్రమంగా బదిలీ చేయడానికి అవకాశం ఇస్తున్నాయని ఆరోపించారు. ఇక కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌కు రేవంత్‌రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఈడీ 2018లోనే ఆయనపై దాడులు చేసిందని గుర్తుచేశారు. ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి ఉపయోగించిన కారు ఈ కంపెనీ పేరుపైనే రిజిస్టర్ అయి ఉందని, ఇది ఆయనకు కంపెనీతో ఉన్న సంబంధాలను ధ్రువీకరిస్తున్నదని ఫిర్యాదులో పేరొన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌కు అనేక పెద్ద కాంట్రాక్టులను అప్పగించిందని తెలిపారు. వాటిల్లో రూ.168 కోట్ల విలువైన మిషన్ భగీరథ కాం ట్రాక్టు, పాలేరు రిజర్వాయర్‌లో రూ.191 కోట్ల ఎత్తిపోతల పథకం కాంట్రాక్టు, రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకంలో రూ.319 కోట్ల కాంట్రాక్టు మొత్తం కలిపి రూ.678 కోట్ల విలువైన 3 కాంట్రాక్టులు ఆ కంపెనీకి ఇచ్చారని చెప్పారు. ఆర్థిక నేరాల విషయంలో ఇప్పటికే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఈడీ పరిశీలనలో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఈ సంస్థకు కాంట్రాక్టులు ఇవ్వడం అత్యంత సందేహాస్పదమని మన్నె క్రిశాంక్ పేరొన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో శోధ కన్స్ట్రక్షన్స్, కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌కు అప్పగించిన కాంట్రాక్టులపై ఈడీ అధికారులు లోతైన విచారణ జరపాలని మన్నె క్రిశాంక్ కోరారు. ఈ కంపెనీల నిధుల మూలాలు, ఆర్థిక లావాదేవీలు, యాజమాన్య వివరాలను పరిశీలించాలని కోరారు. ప్రభుత్వ ధనాన్ని లాండరింగ్ చేయడానికి ఎలాంటి పద్ధతులను ఉపయోగించారో ఈడీ అధికారులు నిర్ధారించాల్సి ఉందని అన్నారు. ఈ ఒప్పందాలలో రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు, భాగస్వామ్యంపై దర్యాప్తు చేయాలని కోరారు. ఈ విషయాన్ని అత్యంత తీవ్రమైనదిగా పరిగణించి తక్షణమే విచారణ చేపట్టాలని ఈడీని కోరారు. అయితే, గతంలో ఇవే అంశాలపై కేటీఆర్ కూడా కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తే.. నేటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు విచారణ చేయించడం లేదని క్రిశాంక్ ప్రశ్నించారు.