సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి శ్వేతపత్రాల సామ్రాట్ అని సైటైర్లు వేశారు. సీఎం అయ్యాక శ్వేతపత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ముఠా గోపాల్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నవీన్ కుమార్ రెడ్డితో కలిసి మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారా.. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ఢిల్లీ పర్యటనలపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల వల్ల వచ్చిన లాభం ఏంటో ప్రజలకు తెలియజేయాలన్నారు.
రాష్ట్ర ప్రజలను బలి ఇవ్వడానికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని మధుసూదనాచారి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రజలను మోసం, దగా చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు 200 రోజులు ఢిల్లీ, విదేశీ పర్యటనలకు వెళ్లారని అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే బొంకులు, హైదరాబాద్లో ఉంటే రంకులు అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి లేదా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మాత్రమే పాలన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. లోపాయికారీ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ఇంటినుంచి, హిడెన్ అజెండాతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన చేస్తున్నారని అన్నారు.
ఎక్కడా అప్పు పుట్టడం లేదని, దొంగను చూసినట్టు చూస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారని.. ఆయన రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నారని మధుసూదనాచారి మండిపడ్డారు. మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. కల్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో సాగునీటికి ఇబ్బందులు తలెత్తలేదని.. ఇప్పుడు మాత్రం ఆ సమస్య ఎందుకు ఏర్పడిందని అడిగారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అవుతుందని.. విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వీటన్నింటిపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి నిరుద్యోగులు ఓట్లు వేశారని.. కానీ సీఎం కాగానే వారిని రేవంత్ రెడ్డి మోసం చేశారని మధుసూదనాచారి మండిపడ్డారు. బీసీల అభివృద్ధికి సంవత్సరానికి 20వేల కోట్ల చొప్పున ఐదేళ్ల కాలంలో రాష్ట్ర బడ్జెట్లో పెడతామని చెప్పి.. కేవలం ఏడు వేల కోట్లు మాత్రమే పెట్టారని అన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశారని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విత్తనాలు, ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో ఉండే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తిరోగమనంలోకి నెట్టారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా పనిచేస్తున్నాయని మధుసూదనచారి అన్నారు. సోషల్మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు.