మహబూబాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇచ్చే బాపతు కాదని, అవసరమైతే మీ మెడల పుస్తెల తాడు ఎత్తుకపోయే రకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మహబూబాబాద్‌లో జరిగిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డిమార్ గుడ్డిదెబ్బల సీఎం అయిన రేవంత్‌రెడ్డి సంతోషంగా ఉండక.. పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిట్టుడు, ఏడ్సుడు తప్ప ఇంకో పని చేస్తలేడని ఎద్దేవా చేశారు.
‘అయనేదో అడ్డిమార్ గుడ్డిదెబ్బల సీఎం అయ్యిండు. అయినప్పుడు సంతోషంగా ఉండొచ్చుగదా..? తెల్లారి లేస్తే కేసీఆర్‌ను తిట్టుడు, మనమీదే ఏడుసుడు తప్ప చేసిందేం లేదు. కొన్ని రోజులు కాళేశ్వరం అంటడు. కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటడు. కొన్ని రోజులు ఫార్ములా-E అంటడు. ఎనకటికి ఎవడో ముఖం బాగలేక అద్దం పగులగొట్టుకున్నడట. రేవంత్‌రెడ్డి తీరు గూడా గట్లనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది.. ‘కట్టిన ఇళ్లు, పెట్టిన పొయ్యి’ లెక్క చేతుల పెడితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
‘ఆడబిడ్డలకు ఇస్తనన్న నెలకు రూ.2,500 సంగతి ఏమైందంటే.. నీ గుడ్లు పీకి గోటీలు ఆడుత అంటడు. రైతులకు ఇస్తనన్న రూ.15 వేల రైతుబంధు ఏమైందంటే.. నీ పేగులు తీసి మెడల ఏసుకుంట అంటడు. ఇసుంటి మాటలే తప్ప, పని చేసుడు చేతగాదు. అత్తకు రూ.4 వేలు అంటివి, కోడలికి రూ.2 వేలు అంటివి. నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అంటివి. తులం బంగారం అంటివి. నీ బొంద అంటివి. ఏడబాయె ఇయ్యన్నీ’ అని దుమ్మెత్తి పోశారు.
‘ఈయన (సీఎం) తులం బంగారం ఇచ్చే బాపతుగాదు.. అవసరమైతే మీ మెడల పుస్తెల తాడు ఎత్తుకపోయే రకం. ఈ సంగతి నేను ఎప్పుడో చెప్పిన ఆడబిడ్డలకు. ఇయ్యాల గదే పరిస్థితి కనబడుతున్నది. ఈయన తీరుతో ప్రజలు.. ‘పాలిచ్చే బర్రెను అమ్మి, తన్నే దున్నపోతును తెచ్చుకున్నం’ అని బాధపడుతున్నరు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్లనే గెలిపించండి. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బీఫామ్ ఇచ్చిన నేతలనే గెలిపించాలె. ఎందుకంటే మీరంతా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలె.. ‘ఇదర్ హై కార్.. ఉదర్ సబ్ భేకార్’. కారు గుర్తు చూడాలె. ఓటెయ్యాలె. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలె’ అని చెప్పారు.