హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం జీవితాన్ని ధారపోసిన పోప్ ఫ్రాన్సిస్ ఈ లోకాన్ని విడిచివెళ్లడం విచారకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన సేవల ద్వారా కోట్లాది మందికి ఆయన మార్గదర్శకుడిగా నిలిచారని అభివర్ణించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం సమస్త మానవాళికి తీరని లోటని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎక్స్ వేదికగా ప్రార్థించారు. ప్రపంచానికి మానవత్వాన్ని పంచిన పోప్ మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఆయన మృతి క్యాథలిక్స్ సమాజానికి తీరనిలోటని అభివర్ణించారు. సామాజిక న్యాయం, పేదల పట్ల ప్రేమ, శరణార్థుల, మహిళల హక్కుల కోసం విశేష కృషి చేసిన పోప్ ఫ్రాన్సిస్ మరణం ఎంతగానో బాధించిందని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి నింపారన్నారు.