హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను అక్రమంగా లాక్కుంటూ ఫార్మా కంపెనీని అక్కడకు తీసుకొచ్చే ప్రయత్నంలో వందల కోట్లు చేతులు మారినట్టు అనుమానంగా ఉందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటులో జరుగుతున్న అక్రమాలను నిగ్గు తేల్చాలని ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాయలంలో మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం క్రిశాంక్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములు తీసుకొని మ్యాక్స్బీన్ ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారని, ఆ ఫార్మా కంపెనీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అల్లుడైన గొలుగూరి సత్యనారాయణరెడ్డికి 16 లక్షల షేర్లు ఉన్నట్టు తెలిపారు. మరో 21 లక్షల షేర్లు ఎస్వీఎస్ ఫెసిలిటీకి, దాని డైరెక్టర్ అన్నం శరత్ పేరిట ఉన్నాయని పేర్కొన్నారు. సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యుల మీద ఇప్పటికే ఎన్నో కేసుల్లో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. వారు ఎన్నో మోసాలకు పాల్పడ్డారని ఈడీ చెప్తున్నదని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులు బ్యాంకులను మోసం చేసి రుణాలను దారిమళ్లించారని, వాటితో ఆస్తులు కూడబెట్టారని, వ్యాపారాలు మొదలుపెట్టారని ఈడీ దర్యాప్తుల్లో తేలిందని చెప్పారు. కొడంగల్లలో నిర్మించబోయే ఫార్మా విలేజ్లో మ్యాక్స్బీన్ ఫార్మా కంపెనీ ఏర్పాటు పేరుతో కొన్ని కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించినట్టు అనుమానం ఉందని పేర్కొన్నారు. అందుకనే ఈడీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
గొలుగూరి రామకృష్ణారెడ్డి, గొలుగూరి వెంకట్రెడ్డి ఇద్దరూ సోదరులే కాకుండా చాలా కంపెనీల్లో డైరెక్టర్లుగా వ్యాపారాలు చేస్తున్నారని క్రిశాంక్ తెలిపారు. గొలుగూరి వెంకట్రెడ్డి మ్యాక్స్బీన్ ఫార్మా కంపెనీ డైరెక్టర్గా ఉన్నారని, ఆయన కుమారుడు, సీఎం రేవంత్రెడ్డి అల్లుడు సత్యనారాయణరెడ్డి కూడా ఒక డైరెక్టర్గా ఉన్నారని తెలిపారు. ఈడీ పేరొన్నట్టు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఈ కంపెనీలోకి కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. గొలుగూరి కుటుంబసభ్యులపై ఇప్పటికే ఎన్నో బ్యాంక్ ఎగవేత కేసులు ఉన్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని మ్యాక్స్బీన్ ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టాలని కోరుతూ ఆధారాలు జతచేసినట్టు వివరించారు.క్రిశాంక్ ఫిర్యాదును స్వీకరించిన ఈడీ దర్యాప్తునకు హామీ ఇచ్చినట్టు తెలిపారు.
కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఫిష్ ట్యాంకుల నిర్మాణం కోసం ఐడీబీఐ బ్యాంకు నుంచి మోసపూరితంగా రూ. 311 కోట్ల రుణాలు తీసుకున్న కేసులో రేవంత్రెడ్డి వియ్యంకుడి తమ్ముడు గొలుగూరి రామకృష్ణారెడ్డిపై గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. రాజమండ్రి కేంద్రంగా ఈ మోసం వెలుగులోకి రావడంతో ఐడీబీఐ అధికారులు విశాఖపట్నం సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి కేసు ప్రధాన నిందితుడైన నేరెళ్ల వెంకటరామమోహన్రావుతో పాటు బడిగంట్ల శ్రీనివాసరావు, బండి నారాయణరావు, గిడుగు సత్యనాగేంద్ర శ్రీనివాసరావు, కర్రి గాంధీ, డాక్టర్ మానేపల్లి సూర్యమాణిక్యం, మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, ఆర్వీ చంద్రమౌళిప్రసాద్, గొలుగూరి రామకృష్ణారెడ్డి, వానపల్లి నారాయణరావుపై ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. వీరు 350 మంది రుణగ్రహీతల పేర్లతో రాజమండ్రి ఐడీబీఐ శాఖ నుంచి కేసీసీ ఫిష్ ట్యాంక్ నిర్మాణాల కోసం రూ. 311.05 కోట్ల రుణాలు పొందారని తెలిపింది. తాజాగా గత జూలై 31న రూ.19.11 కోట్ల స్థిరాస్తులను అటాచ్ చేసింది. వీరు గతంలో తీసుకున్న రూ.311 కోట్ల రుణాలను వారి కుటుంబసభ్యులు, బినామీల పేరు మీద స్థిరాస్తుల కొనుగోలు చేశారు.