హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘ఖబడ్దార్.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో’ అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హెచ్చరించారు. వెంకట్‌రెడ్డి నోరు మూసీ కన్నా అధ్వానంగా మారిందని విమర్శించారు. ‘తాగి ఏం మాట్లాడుతవో, ఏం చేస్తవో తెలియదు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కాలిగోటికి సరిపోవు. నీ స్వగ్రామం బ్రహ్మణవెల్లెంలలో రూ.5 కోట్ల విలువైన సబ్‌స్టేషన్ సామగ్రిని అమ్ముకొన్నది నువ్వు, నీ అనుచరులు కాదా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిపై మంత్రి వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సోదరులు నల్లగొండ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. మంత్రి పదవి కాపాడుకోవడానికే రేవంత్‌రెడ్డి భజన చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ నీళ్లు ఖమ్మంకు తరలిపోతున్నాయని, నల్లగొండకు రావడం లేదని దుయ్యబట్టారు.
కోమటిరెడ్డి సంసారహీనంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ విమర్శించారు. మూసీ పునరుజ్జీవానికి బీజం వేసిందే కేసీఆర్ అని, రూ.16 వేల కోట్లతో బిఆర్ఎస్ ప్రభుత్వం డీపీఆర్ రెడీ చేసిందని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లకు ఎందుకు పెంచిందని నిలదీశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టుల పనులను 90% పూర్తి చేశామని చెప్పారు.
చంద్రబాబు సూచనలతోనే రేవంత్‌రెడ్డి మూసీ అంచనాలు పెంచారని, ప్రపంచబ్యాంకు నుంచి అప్పులు తెచ్చి వాటిని ప్రజల నెత్తిన రుద్దాలని చూస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులున్నా చెరువులను ఎందుకు నింపడం లేదని నిలదీశారు. సీఎం, మంత్రులు సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వస్తే తరిమికొట్టే పరిస్థితి వచ్చిందని అన్నారు. రెఫరెండం పెట్టి ఎన్నికలకు వెళ్లే సత్తా కాంగ్రెస్‌కు ఉన్నదా? అని నిలదీశారు.
మంత్రి కోమటిరెడ్డి జిల్లా ప్రజల్లో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన తన భాష మార్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చెప్పారు. మూసీ పునరుజ్జీవనం కావాల్సిందే కానీ లక్షన్నర కోట్లు ఎందుకు అవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ కాలుష్య కాసారంగా మారడానికి కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు. 70 ఏండ్ల కాంగ్రెస్ పాలన, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో, జిల్లాలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని కోమటిరెడ్డికి బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ సవాల్ విసిరారు.