Jagadish Reddy | నాడు నిండు కుండలా ఉన్న మానేరు.. నేడు అడుగంటిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. మానేరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్‌దే అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా కరీంనగర్ శివారులోని లోయర్ మానేరు డ్యామ్‌ను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. లక్షలాది క్యూసెక్కుల గోదావరి నీటిని సముద్రం పాలు చేసిండ్రని విమర్శించారు.
కాళేశ్వరం నీళ్లతో సూర్యాపేట జిల్లా ఇప్పటికే సస్యశ్యామలంగా ఉండేదని జగదీశ్ రెడ్డి అన్నారు. అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, లక్ష్మీ పంప్ హౌజ్ ద్వారా పైనున్న మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు నింపవచ్చన్నారు. అక్కడి నుంచి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నీళ్లను చేర్చవచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సోయితో ఆలోచన చేస్తే హుజూరాబాద్, వరంగల్ మీదుగా మైలవరం ప్రాజెక్టు బయ్యన్న వాగు ద్వారా ఇప్పటికే తుంగతుర్తి, సూర్యపేట రైతాంగానికి మేలు జరిగేదని చెప్పారు.
రైతు సంక్షేమాన్ని వదిలేసి ఎంతసేపు కేసీఆర్‌ను విమర్శించడం, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. నీళ్లతో నిండాల్సిన మానేరు గడ్డి మొలిచి బీడుగా మారిందన్నారు. సూర్యాపేట జిల్లాలో అనేక చెరువులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు మేల్కొని ప్రజల సమస్యల పట్ల, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల దృష్టి పెడితే మంచిదని హితవుపలికారు. అధికారం చేపట్టి 7 నెలలు గడుస్తున్నా ఇంకా గత ప్రభుత్వంపై విమర్శలేనా.. అభివృద్ధి పట్టదా అని మండిపడ్డారు.