Jagadish Reddy | చరిత్రలో నిలిచిపోయేలా BRS రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. రజతోత్సవ సన్నాహక సభను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు జగదీశ్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న సభకు తరలివెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయని అన్నారు. కేసీఆర్ స్పీచ్ కోసం ప్రజలంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే వైఫల్యం చెందిందని జగదీశ్ రెడ్డి అన్నారు. నెరవేర్చలేని హామీలతో కాంగ్రెస్ అభాసుపాలైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై అన్ని రంగాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని తెలిపారు. రైతుబంధు లేదు.. రైతు భరోసా లేదు.. రైతు బీమా లేదు.. రుణమాఫీ పూర్తి కాలేదని.. ఆసరా ఫించన్లు పెంచలేదని.. ఉన్న పింఛన్లు సమయానికి ఇస్తలేరని విమర్శించారు. ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేసే దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలకు మోసపోయి ప్రజలు గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని రంగాల ప్రజల నోట నేడు కేసీఆర్ మాటలే వినిపిస్తున్నాయని జగదీశ్ రెడ్డి తెలిపారు. నీళ్లు లేక ఎండిన పంటలు.. చేతికొచ్చిన ఎంతో కొంత పంటకు మద్దతు ధర లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, రైతాంగం ఇలా అన్ని రంగాలలో ఎవరి నోట విన్న నేడు కేసీఆర్ మాటే వినిపిస్తుందని అన్నారు. గత పదేండ్లు బీఆర్ఎస్ హయాంలో.. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రశాంత వాతావరణాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకొని రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌దే అని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల అభివృద్ధితో మన రాష్టాన్ని యావత్ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. అటువంటి గొప్ప నాయకత్వాన్ని కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి దూరం చేసుకున్నామని అన్ని రంగాల ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు.
ఈ కాంగ్రెస్ పాలనలో ఇంకా మూడున్నర ఏండ్లు ఎలా బతకాలో అని అన్ని రంగాల ప్రజలు ప్రశ్నార్థకంగా ఉన్నారని జగదీశ్ రెడ్డి అన్నారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని అంతా నమ్ముతున్నారని తెలిపారు. అందుకే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటల కోసం ప్రజలంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈనెల 27న వరంగల్ లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సకాలంలో చేరుకునేలా అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.