BRS Leader Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిన గ్రామీణ ప్రాంతాల్లో అడ్డగోలుగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీ జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో 2014కి ముందు నాటి పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రైతుల పంట పొలాల్లో విద్యుత్ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లాకు మళ్లీ ఫ్లోరైడ్ భారీన పడే పరిస్థితి తలెత్తిందన్నారు. వేలాది గ్రామాలకు తాగునీరు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో రైతాంగం పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నదని జగదీశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దొంగ లెక్కలతో రుణమాఫీ చేశామని ప్రభుత్వం అంటున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా రైతు భరోసా ఇవ్వమని రైతులు మొత్తుకుంటున్నారని అన్నారు. రైతులు పండించిన పత్తి ప్రభుత్వం కొనడం లేదని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ధాన్యం కల్లాల్లో ఆరబోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై ఇప్పటి వరకూ రాష్ట్ర మిల్లర్లతో చర్చలు జరుపలేదని అన్నారు. వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ సమీక్షించనే లేదని ఎద్దేవా చేశారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేవని జగదీశ్ రెడ్డి చెప్పారు. సన్న బియ్యంపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని, కానీ, దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పత్తి రైతులకు ద్రోహం చేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో పత్తి రైతుల నుంచి సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వం కిలో పత్తి కూడా కొనలేదన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని జగదీశ్ రెడ్డి మండి పడ్డారు. పత్తిపంటకు కేంద్రం రూ.7000 మద్దతు ధర, గుజరాత్లో రూ.8000 మద్దతు ధర ప్రకటించారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే, ఫోర్త్ సిటీ, ఫిఫ్త్ సిటీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి తిట్టినా బీజేపీ నేతలు నిశ్శబ్ధంగా ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డిని విమర్శించే మగాడు బీజేపీలో లేడన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తప్పులను ప్రజల గొంతుక సోషల్ మీడియా ఎత్తి చూపుతున్నదన్నారు. అరెస్టులతో ఉద్యమాలను సీఎం రేవంత్ రెడ్డి ఆపలేరని స్పష్టం చేశారు.